పెరుగుతున్న గోదావరి ఉధృతి.. సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ!

by Rajesh |
పెరుగుతున్న గోదావరి ఉధృతి.. సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ!
X

దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు 36.30 అడుగులు ఉన్న గోదావరి, మధ్యాహ్నం 12 గంటలకు 38.90 అడుగులకు చేరి ప్రవహిస్తుంది. సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా చర్ల, దుమ్ముగూడెం మండలాలలో పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. తెలంగాణ నుండి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వెళ్లే ప్రధాన రహదారులు వెంకటాపురం మండలం టేకులగూడెం వద్ద, దుమ్ముగూడెం మండలం కే. లక్ష్మీపురం వద్ద రహదారిపైకి వరద నీరు చేరడంతో ఆ రాష్ట్రానికి రాకపోకలు స్తంభించాయి.

అలాగే ఆంధ్రలోని కూనవరం, భద్రాచలం మధ్య రహదారిపై గోదావరి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో, భద్రాచలం ఆర్డీవో కార్యాలయం, ఐటీడీఏ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం ప్రజలు కలెక్టర్ కార్యాలయంలోని 08744-241950, భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలోని 08743-232444, ఐటిడిఏ కార్యాలయంలోని 7995268352 నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు కోరారు. దుమ్ముగూడెం మండలంలో సీత వాగు పొంగడం కారణంగా ప్రముఖ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతమైన సీతమ్మ వారి నార చీరలు ముంపునకు గురయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed