జీనోమ్‌ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తాం : Minister KTR

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-21 08:15:11.0  )
జీనోమ్‌ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తాం : Minister KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారులోని జీనోమ్‌ వ్యాలీలో బీఎస్‌వీ కంపెనీ కొత్త యూనిట్‌కు మంత్రి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారత్‌ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీలో ఫేజ్‌-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి సందర్భంగా ప్రకటించారు.

దేశంలో ఎక్కడా లేని అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు.. ఎక్కడా లేనంత వేగంగా పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందనడం నిర్వివాదమని పేర్కొన్నారు. మాకు కేంద్ర ప్రభుత్వానికి పడదు.. తెల్లారిలేస్తే మేమూ, వాళ్లూ తిట్టుకుంటాం.. విమర్శలు చేసుకుంటాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఎప్పుడు ఏదో పంచాయితీ నడుస్తూనే ఉంటుంది.. అయినప్పటికీ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో నంబర్‌వన్‌ ఎవరని అడిగితే తెలంగాణ అని వాళ్లు కూడా ఒప్పుకునే పరిస్థితిని సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం 1,49,000 ఉండగా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,000గా ఉందన్నారు.

సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోందని మంత్రి అన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌ మారిందని ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 50 శాతం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి నిపుణులైన యువకులు ఉండటం, వాళ్లను చూసి కంపెనీలు ఇక్కడికి రావడం, వారికి ప్రభుత్వం సహకరించడమే కారణమని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed