ముస్లిం సమాజంలో స్పృహ తీసుకొచ్చిన నేత గద్దర్.. కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |
ముస్లిం సమాజంలో స్పృహ తీసుకొచ్చిన నేత గద్దర్.. కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో మత ఘర్షణలు తారస్థాయికి చేరిన సందర్భంలోనే గద్దర్ అండర్‌గ్రౌండ్ నుంచి బయటికి వచ్చి తన పాటలతో ముస్లిం సమాజంలో స్పృహ తీసుకువచ్చారని ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. అన్నదమ్ముల్లా కలిసుండాలంటూ ఆయన బ్రతిమలాడారు. ఇదే సమయంలో, మరోవైపు జహీర్ అలీ ఖాన్ మత ఘర్షణలకు వ్యతిరేకంగా కార్యాచరణలో ముందుండి పనిచేశారని, ఇద్దరి బంధం అప్పటి నుంచి విడదీయరానిదిగా మారిందని పేర్కొన్నారు.

ఆదివారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్‌టీయూ భవన్‌లో జరిగిన "ప్రజా యుద్ధ నౌక గద్దర్, సియాసత్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్" సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా కోదండరామ్ పాల్గొని మాట్లాడారు. గద్దర్ పాటలు, నాటకాలు, ప్రదర్శనలు తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచి లాంటివి అని చెప్పుకొచ్చారు. జహీర్ అలీ ఖాన్ సేవాగుణం అపారమైనది. సియాసత్ పత్రికను నడుపుతూనే పేదలకు ఎప్పుడూ సహాయం చేసేవారన్నారు. వారి ఇద్దరి మరణం ఒకే రోజున జరగడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్, జహీర్ అలీ ఖాన్ నమ్మిన విలువల కోసం చివరి వరకు నిలబడ్డారని, వారి స్ఫూర్తితో మనం సమాజ సేవలో అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed