స్టేట్ చీఫ్‌గా వారికే ఛాన్స్ అంటూ లీకులు.. PCC చీఫ్ ఎంపికలో రేవంత్‌కు ఫ్రీడమ్!

by Rajesh |
స్టేట్ చీఫ్‌గా వారికే ఛాన్స్ అంటూ లీకులు.. PCC చీఫ్ ఎంపికలో  రేవంత్‌కు ఫ్రీడమ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఆయన సూచించిన వ్యక్తికే పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. దీంతో రేవంత్ ఎవరి పేరును ప్రతిపాదిస్తారనే ఉత్కంఠ నెలకొన్నది. పార్టీ బాధ్యతలను బీసీలకు ఇస్తారా? లేకపోతే ఎస్సీ, ఎస్టీలకు అప్పగిస్తారా? అనే చర్చ జరుగుతున్నది. అయితే కొందరు మంత్రులు పీసీసీ పోస్టు కోసం ట్రై చేస్తుండగా, జోడు పదవులు లేవని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలిసింది.

వైఎస్‌ను మరిపిస్తున్న రేవంత్

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయన అభిప్రాయాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో సీఎం రేవంత్‌కు అంతటి ప్రాధాన్యత ఇస్తోందని ప్రచారం జరుగుతున్నది. 2004లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఆ పదవి కోసం చాలా మంది వైఎస్సార్ వ్యతిరేకులు ప్రయత్నించినా, చివరికి వైఎస్సార్ సూచన మేరకు అధిష్టానం ఆయనకు సన్నిహితుడిగా ఉన్న ఎంపీ కే.కేశవరావును పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ అభిప్రాయాలను గౌరవిస్తుందనే టాక్. అందుకే ఆయన సూచించిన వ్యక్తికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ నేతల పేర్లు సైతం ఏఐసీసీ వద్దకు వెళ్లినట్టు తెలిసింది.

విభేదాలు, అసమ్మతి లేకుండా..

పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎం, పీసీసీ చీఫ్‌కు మధ్య విభేదాలు రాకుండా ఏఐసీసీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. సీఎంకు సన్నిహితంగా ఉండే వ్యక్తినే పీసీసీ‌గా అపాయింట్ చేయాలని భావిస్తున్నది. అందుకే పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై రేవంత్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. ఒకవేళ సీఎంతో పొసగని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే, నిత్యం ఇరువురు మధ్య విభేదాలు, అసమ్మతి ఏర్పడి చికాకులు, పంచాయితీలు తలెత్తి పార్టీ బలహీనపడే ప్రమాదముంటుందనే అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్టు తెలుస్తున్నది. ఎంపీనే పార్టీ స్టేట్ చీఫ్ చేసే చాన్స్ ఉందని లీకులు వస్తున్నాయి.

బీసీ ఎంపీకి పీసీసీ పగ్గాలు?

సీఎం పదవిని రెడ్డిలకు ఇవ్వడంతో, బీసీలకు పీసీసీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నది. దీంతో తమకు చాన్స్ ఇవ్వాలని సోనియాగాంధీని మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ కలిశారు. అలాగే ఎస్సీ కోటాలో మల్లు రవి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్ లాబీయింగ్ చేస్తున్నారు. కానీ, పీసీసీ పదవిని బీసీ వర్గానికి చెందిన ఓ ఎంపీకి ఇవ్వాలనే ప్రతిపాదనను సీఎం రేవంత్ అధిష్టానం ముందుపెట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సదరు ఎంపీకి రెండు సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కష్టకాలంలో పార్టీలోనే కొనసాగారు. అలాగే ఆయన తాత, తండ్రులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే.

జూలై 7 లోపు కొత్త చీఫ్!

వచ్చేనెల ఏడో తేదీతో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి టర్మ్ పూర్తి కానుంది. దీంతో కొత్త చీఫ్ ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రేవంత్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ..త్వరలో కొత్త చీఫ్‌ను ప్రకటించే అవకాశమున్నట్టు తెలిసింది. ఒకవేళ జూలై 7లోపు నియమించడం సాధ్యం కాకపోతే..బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత (శ్రావణ మాసంలో) కొత్త పీసీసీని అనౌన్స్ చేసే అవకాశముందని సమాచారం.

జోడు పదవులు ఉండవు

కొందరు మంత్రులు పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఆ లిస్టులో బీసీ వర్గానికి చెందిన మంత్రులతో పాటు ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు కూడా ఉన్నారు. అయితే ఒకరికి జోడు పదవులు ఇవ్వడం కుదరదని, పార్టీ అధ్యక్ష పదవి కావాలంటే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని అధిష్టానం వారికి స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

Next Story

Most Viewed