జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రభుత్వం ప్రయత్నాలు!.. మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి

by Ramesh Goud |
జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రభుత్వం ప్రయత్నాలు!.. మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో కొలువుల జాతర కొనసాగుతోందని, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు భరోసాగా నిలబడిందని, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో పేపర్ల లీకేజీలు, రిజర్వేషన్ల వివాదాలు, ఫలితాల నిలిపివేతలు, కోర్టు కేసులు నిరుద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయని, దాదాపు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్న గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు రెండు సార్లు రద్దు చేసిందని గుర్తు చేశారు. గత పాలకవర్గాన్ని తప్పించి కొత్త ఛైర్మన్ ను, బోర్డు సభ్యులను నియమించిందని, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణను కూడా కట్టుదిట్టం చేసిందని తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఢిల్లీకి వెళ్లి యూపీఎస్ సీ ఛైర్మన్ ను కలిసి జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారని అన్నారు.

గత ప్రభుత్వ హయంలో వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల పరిధిలో ప్రధాన అడ్డంకిగా మారిన కోర్టు కేసుల చిక్కుముడులన్నింటినీ ఒక్కటొక్కటిగా కొత్త ప్రభుత్వం అధిగమించిందని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మొత్తం 28,942 మందికి ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలను అందించిందని తెలియజేశారు. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ద్వారా మొత్తం 28,942 పోస్టులను కొత్త ప్రభుత్వం భర్తీ చేసిందని, వీటిలో 15,371 పోస్టులకు పురుషులు ఎంపిక అవ్వగా.. మిగతా 13,571 పోస్టులను మహిళలు సాధించారన్నారు. గతంలో నియామకాల్లో అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలోనూ కోర్టు తీర్పులకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అనుసరించిందని తెలిపారు. అలాగే ఉద్యోగ నియామకాలతో పాటు జాబ్ క్యాలెండర్ను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని, అందులో భాగంగానే గతంలో రెండుసార్లు రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించిందని, అందుకు సంబంధించి టీజీపీఎస్సీ రేపో ఎల్లుండో ఫలితాలను వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం అందించారు.

మరోవైపు గ్రూప్ 2 పరీక్షలను షెడ్యూలు ప్రకారం ఆగస్టులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 నుంచి ఇప్పటివరకు 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేయగా.. గత ప్రభుత్వ హయాంలో పేపర్ల లీకేజీలతో 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయని, అప్పుడు నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఒక్కటి కూడా వెల్లడి కాలేదని తెలిపారు. కొత్త ప్రభుత్వం నియమించిన టీజీపీఎస్సీ బోర్డు వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసిందని, అప్పుడు పెండింగ్లో పెట్టిన గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసిందని, ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్ర్రక్రియ కొనసాగుతోందని అన్నారు. ఇక 1540 ఏఈఈ పోస్టులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కూడా పూర్తయిందని, వ్యవసాయ, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల సెలెక్టెడ్ లిస్ట్ కూడా విడుదలైందని తెలిపారు. అలాగే 581 వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు పరీక్షలు ఈనెల 29తో ముగియనున్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా 11062 పోస్టులను మెగా డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించిందని, టెట్ 2024ను ప్రశాంతంగా నిర్వహించిందని సామా రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు.

Next Story

Most Viewed