కాల్వ కబ్జా చేసి.. 'రైతు బంధు' నొక్కేసి..

by Sumithra |
కాల్వ కబ్జా చేసి.. రైతు బంధు నొక్కేసి..
X

దిశ, పర్వతగిరి : దర్జాగా ఎస్సారెస్పీ కాల్వను కబ్జా చేశారు. అడ్డుగా ఇళ్లు నిర్మించి రాకపోకలు నిలిపివేశారు. అలాగే పక్కనే ఉన్న మరో రైతు భూమిని సైతం ఆక్రమించి, కబ్జా చేసిన కాల్వతో సహా అక్రమంగా పట్టా పాస్ బుక్ సృష్టించి 10 విడతలుగా రైతు బంధు సొమ్ము కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పర్వతగిరి మండలంలోని దౌలత్ నగర్ గ్రామం నుంచి ఇస్లావత్ తండా గ్రామానికి వెళ్లే దారిలో సర్వే నంబర్ 443, 444, 446 గల భూమిలో ఎస్సారెస్పీ ఉపకాల్వను 25 ఏళ్ల క్రితం నిర్మించారు. బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించి సంబంధిత శాఖల అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇస్లావత్ హస్లీ కాల్వ పక్కనే భూమిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. హస్లీ భూమి పక్కనే ఇస్లావత్ వాల్యకు ఒక ఎకరం పది గుంటల భూమి ఉంది. అందులో ఉన్న భారీ వృక్షాలను తొలగించేశారు.

అయితే ధరణి పుణ్యమా అని కొనుగోలు చేసిన భూమితో పాటు ఇస్లావత్ వాల్యకు చెందిన భూమిని, ఎస్సారెస్పీ ఉప కాల్వ భూమిని తన పేర అక్రమంగా పట్టా చేయించుకున్నారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న రైతు బంధు సొమ్ము సైతం ఇస్లావత్ హస్లీ అక్రమంగా నొక్కేస్తుంది. ఈ సందర్భంగా ఇస్లావత్ వాల్య తన భూమిలో సాగు చేసేందుకు వెళ్లగా హస్లీ కుటుంబ సభ్యులు ఇస్లావత్ లుంబా, అతని కుమారులు ఇస్లావత్ బాలు, వెంకన్న, కోడళ్లు సునీత, ఉమా రాణి దాడికి పాల్పడ్డారు. కాల్వ పై నుంచి వెళ్లేందుకు సైతం దారి లేక మొత్తం దున్నేశారు. ఇదే విషయాన్ని స్థానిక ఎస్సై కి బాధిత రైతు వాల్య తెలుపగా భూ సంబంధిత సమస్యలకు తహశీల్దార్ ను సంప్రదించాలని సూచించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయానికి వాల్య వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఎస్సారెస్పీ ఉపకాల్వను కబ్జా చేసిన ఇస్లావత్ హస్లీతో పాటు కుటుంబ సభ్యుల పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. అలాగే అక్రమంగా పొందిన పట్టా పాస్ బుక్ ను రద్దు చేసి, 10 విడతలుగా రైతు బంధు సొమ్ము కాజేసిన నగదును రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవరీ చేయాలని తోటి రైతులు కోరుతున్నారు. ఇదే విషయం పై మండల ఐబీ ఏఈ ప్రశాంత్ ను మీడియా ఫోన్ లో సంప్రదించగా కాల్వ కబ్జా చేసినట్లు సమాచారం ఉందని, ప్రస్తుతం తాను సెలవులో ఉన్నానని చెప్పారు.

అక్రమ పట్టాను రద్దు చేయాలి : వాల్య, బాధిత రైతు

25 ఏళ్ల క్రితం ఎస్సారెస్పీ ఉపకాల్వ కింద నా భూమి ఇచ్చా. సర్వే నంబర్ 444, 446 లో ఒక ఎకరం పది గుంటల భూమి ఉండగా కాల్వకు పోగా మిగిలిన ఎకరం భూమి కబ్జాకు గురైంది. కాల్వ భూమితో పాటు తన సొంత జాగా సైతం ఆక్రమించి అక్రమంగా పట్టా చేసుకున్నారు. ఇదేంటని అడిగితే హస్లీ కుటుంబ సభ్యులు దాడికి పాల్పడుతున్నారు. అధికారులు విచారణ చేపట్టి అక్రమ పట్టాను రద్దు చేసి తనకు న్యాయం చేయాలి.

Next Story

Most Viewed