మరో నాలుగు రోజులు వర్షం..! తడిసి ముద్దయిన మహానగరం

by Shiva |
మరో నాలుగు రోజులు వర్షం..! తడిసి ముద్దయిన మహానగరం
X

దిశ, సిటీబ్యూరో : ఇప్పటికే ఎడతెరపి లేని వర్షం కురుస్తున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రానున్న నాలుగు రోజుల పాటు చిరుజల్లులు మొదలుకుని ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీంతో వర్షంతో హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అలర్ట్‌గా ఉండాలన్న సర్కారు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ, ఈవీడీఎం కూడా అలర్ట్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో అందుబాటులో ఉన్న డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలు విధి నిర్వహణలో నిమగ్నమయ్యాయి. మరో నాలుగు రోజుల పాటు నగరానికి వర్ష సూచన ఉండటంతో ప్రజలకు అత్యవసరమైతే తప్పా, బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. నాలుగు రోజుల పాటు ఇదే తరహాలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసే అవకాశాలున్నందున శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఇప్పటికే సికింద్రాబాద్, చార్మినార్, గోషామహల్ సర్కిళ్లలోని పలు పాతకాలపు భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నందున పాతకాలపు భవనాలు, చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాల వద్ద ప్రజలు నిల్చోవద్దని జీహెచ్ఎంసీ సూచించింది. దీనికి తోడు లోతట్టు ప్రాంతాలు, నాలాల పరివాహక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇప్పటికే నాలాల వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా నాలా సేఫ్టీ ఆడిట్ కింద జాలీలతో ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు.

క్షేత్రస్థాయిలో అమలు కాని కమిషనర్ ఆదేశాలు..

మహానగరంలో వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ నుంచి అలర్ట్ వచ్చిన వెంటనే వర్షం కురుస్తున్నప్పుడు, అవసరమైతే వర్షం కురవటం ఆగిన తర్వాత కూడా జీహెచ్ఎంసీకి చెందిన ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దాదాపు అరడజను సార్లు ఆదేశాలు జరీ చేసినా అవి క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. పైగా కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లకు కొత్త ఐఏఎస్ ఆఫీసర్లు జోనల్ కమిషనర్లుగా వచ్చారు.

కానీ శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లకు పాత ఆఫీసర్లే జోనల్ కమిషనర్లుగా వ్యవహరిస్తున్నా, పాత వారిలో ఒక్క సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ తప్ప మిగిలిన ఆఫీసర్లు క్షేత్రస్థాయి విధుల్లో కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది. వీరు ఉద్దేశపూర్వకంగానే కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా? లేక నిజంగా బిజీగా ఉంటూ క్షేత్రస్థాయి విధులకు వెళ్లటం లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా వర్షం కారణంగా రోడ్లపై ఏర్పడుతున్న గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చేందుకు ఇన్‌స్టెంట్ రీపేర్ టీమ్ (ఐఆర్టీ) బృందాలు, వర్షాకాలం ప్రజల కష్టాలను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన మాన్‌సూన్ బృందాలను సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నా, ఎక్కడా కూడా బృందాలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తూ కనిపించటం లేదన్న విమర్శలున్నాయి.

ఫిర్యాదులకు హెల్ప్‌లైన్ నెంబర్లు

నగరంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షం కురుస్తుందని ఐఎండీ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్పా, బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111, లేదా విపత్తుల నివారణ కోసం డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ సహాయం కొరకు 90001 13667 లను సంప్రదించాలని కమిషనర్ కోరారు.

గాజులరామారంలో 23.9 మి.మీ., వర్షం

హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి కురుస్తున్న వర్షంతో శనివారం సాయంత్రం 7 గంటల కల్లా అత్యధికంగా గాజులరామారంలో 23.9 మి.మీ.లుగా వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా సంతోశ్ నగర్‌లో 2.4 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నగరంలోని దాదాపు అన్ని చోట్లలో చిరుజల్లులు కురుస్తున్నాయి. కార్వాన్‌లో 20.8 మి.మీ.లు, యూసుఫ్‌గూడలో 20.1 మి.మీ.లు, ఫలక్‌నుమాలో 19.0 మి.మీ.లు, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో 18.1 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మెహిదీపట్నం, సరూర్‌నగర్, ముషీరాబాద్, ఆల్వాల్, ఉప్పల్ ప్రాంతాలలో చిరుజల్లులు కురిసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed