Sharad Pawar : అజిత్‌కే ఎక్కువ సీట్లొచ్చాయ్.. అసలైన ఎన్‌సీపీ నాదేనని అందరికీ తెలుసు : శరద్ పవార్

by Hajipasha |
Sharad Pawar : అజిత్‌కే ఎక్కువ సీట్లొచ్చాయ్.. అసలైన ఎన్‌సీపీ నాదేనని అందరికీ తెలుసు : శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ కంటే అజిత్ పవార్(Ajit Pawar) వర్గం ఎన్‌సీపీ(NCP) ఎక్కువ సీట్లను గెల్చుకోవడంపై ఎన్‌సీపీ-ఎస్‌పీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) స్పందించారు. అజిత్ వర్గమే ఎక్కువ సీట్లను గెల్చుకుందనే విషయాన్ని ఒప్పుకోవడానికి తనకు ఎలాంటి బేషజం లేదన్నారు. అయితే అసలైన ఎన్‌సీపీని ఎవరు స్థాపించారనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. బారామతి అసెంబ్లీ స్థానంలో అజిత్ పవార్‌పై యుగేంద్ర పవార్‌ను పోటీకి నిలపాలనే తన నిర్ణయం ముమ్మాటికీ సరైనదేనని శరద్ పవార్ తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర ప్రజలు మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిని తిరస్కరించారంటే తాను నమ్మలేకపోతున్నానని శరద్ పవార్ చెప్పారు. ఈ ఫలితాలతో తాను తీవ్ర ఆవేదనకు లోనైనట్లు తెలిపారు. అయినా పునరుత్తేజంతో కూటమిలోని పార్టీలన్నీ ప్రజలతో మమేకం అవుతాయన్నారు. ఎంవీఏ కూటమిలోని పార్టీలన్నీ ఎన్నికల్లో ఏకతాటిపై నడిచాయని, చీలికలు అనే ముచ్చటే లేదని స్పష్టం చేశారు. అజిత్ పవార్ వర్గం చేస్తున్న పొలిటికల్ రిటైర్మెంట్‌ విమర్శలపై శరద్ పవార్ స్పందిస్తూ.. ‘‘నేను ఏం చేయాలనేది వాళ్లు డిసైడ్ చేయలేరు. నేను, నా టీమ్ దానిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని తేల్చిచెప్పారు. ‘‘యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మహారాష్ట్రకు పిలిపించి బటేంగే తో కటేంగే నినాదం చెప్పించారు. తద్వారా రాష్ట్ర ఓటర్ల మధ్య వైషమ్యాలను బీజేపీ క్రియేట్ చేసింది. ఈ పరిణామమే ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది’’ అని ఆయన ఆరోపించారు. మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి ఎన్నికల్లో మహాయుతి కూటమి డబ్బును ఖర్చు చేసిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed