ఎన్నికల వేళ కేసీఆర్‌కు మరో షాక్.. వరుసగా అసమ్మతి గళం విప్పుతోన్న BRS మాజీ ఎంపీలు..!

by Satheesh |   ( Updated:2023-10-10 11:18:00.0  )
ఎన్నికల వేళ కేసీఆర్‌కు మరో షాక్.. వరుసగా అసమ్మతి గళం విప్పుతోన్న BRS మాజీ ఎంపీలు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశపడుతున్న సీఎం కేసీఆర్‌కు పార్టీలోని సీనియర్లు వరుసగా షాక్ ఇస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వెలువడినా ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఆగడం లేదు. టికెట్ ఆశించి భంగపడిన నేతల్లో అనేక మంది ఇప్పటికే కారు దిగి పక్క పార్టీల్లో చేరుతుంటే తాజాగా ఇద్దరు మాజీ ఎంపీలు పార్టీపై అసమ్మతి గళం వినిపించడం హాట్ టాపిక్‌గా మారింది. టికెట్ విషయంలో అసంతృప్త నేతలను సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు ఇప్పటికే బుజ్జగింపులతో కట్టడి చేసే ప్రయత్నం చేయగా.. పార్టీలో తనకు కనీస మర్యాద దక్కడం లేదని సీనియర్ నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్ మీడియాకెక్కడం కారు పార్టీలో సంచలనం అవుతోంది.

నన్నెందుకు దూరం పెడుతున్నరు..?:

బీఆర్ఎస్‌లో నేతలకు దక్కుతున్న ప్రయార్టీలపై గత కొంత కాలంగా సీరియస్‌గా చర్చ సాగుతోంది. ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకున్న వారిని కాదని, కనీసం ఉద్యమంలో ఎక్కడా కనిపించని వారిని అందలమెక్కిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అనేక మంది బీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతుంటే మరి కొంతమంది అవకాశం దక్కకపోతుందా అని ఇప్పటికీ ఎదురుచూస్తునే ఉన్నారు. ఈ క్రమంలో అధినేత కేసీఆర్‌కు నమ్మకంగా ఉంటూ వస్తున్నా కనీసం మర్యాద దక్కడం లేదని వరుసగా మాజీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

బీఆర్ఎస్‌లో తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఇటీవలే మాజీ ఎంపీ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందాజగన్నాథం అసంతృత్తి వ్యక్తం చేయగా.. తాజాగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాడినని, కేసీఆర్ అడుగులో అడుగు వేసిన వారిలో తాను ఒక్కడిని అని.. అలాంటి నన్ను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరం పెడుతున్నారని నిలదీశారు. ఈ వయసులో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానం భరించడానికి కష్టంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేదు, మాజీ ఎంపీనన్న కనీస గౌరవం లేదని తన అసంతృప్తిని కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు.

బుజ్జగింపులు తప్ప న్యాయం జరగడం లేదు:

ఇటీవల మాజీ ఎంపీ మందా జగన్నాథం సైతం బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. నా కుమారుడికి ప్రత్యామ్నాయం చూపిస్తామని బుజ్జగించి చివరకు నిరాశకు గురిచేశారు. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొన్న తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని జై తెలంగాణ పేరెత్తని వారికి సైతం టికెట్ ఇచ్చారు. కానీ పార్టీనే నమ్ముకున్న తమకు మొండిచేయి చూపించారని మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధమైన వేళ అధికార పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed