అంతా తెలిసి ఏం చేశారు.. బండి సంజయ్‌: రవీంద్రనాయక్

by srinivas |
అంతా తెలిసి ఏం చేశారు.. బండి సంజయ్‌: రవీంద్రనాయక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దీర్ఘకాలంగానే స్నేహ సంబంధాలు ఉన్నాయని, ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలతో పాటు స్వయంగా ప్రధాని కార్యాలయానికే ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయని, ఒక్కదానిపైనా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ ‘శికంజా కస్ రహా హై’ అంటూ హెచ్చరికలు చేశారని, ఇప్పటికి పది నెలలు దాటినా ఆ దిశగా ఎందుకు యాక్షన్ లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పది నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై ఢిల్లీలో రవీంద్ర నాయక్‌ స్పందించారు. బీఆర్ఎస్‌ను ఎక్కడికక్కడ సేవ్ చేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఆ ఆరోపణలను కాంగ్రెస్ మీదకు నెట్టి ప్రజలను డైవర్ట్ చేస్తోందని ఆయన ఆరోపించారు.

వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగిన కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆ దేవుడు కూడా కాపాడలేరంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా కాలంగా కామెంట్ చేస్తున్నారని, ఆ పని చేయడానికి ఎవరు అడ్డుపడుతున్నారని, ఎవరు ప్రలోభాలకు గురిచేస్తున్నారని రవీంద్రనాయక్ ప్రశ్నించారు. పదేళ్లుగా చర్యలకు వెనకాడిన బీజేపీ.. ఇప్పుడు పది నెలల పాలనలో ఉన్న కాంగ్రెస్‌ను బండి సంజయ్ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందంటూ స్వయంగా కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా తెలంగాణ గడ్డమీదనే వ్యాఖ్యానించారని, ఆ ఆరోపణలకు తగినట్లుగా కార్యాచరణ ఎందుకు లేదని నిలదీశారు. ఇప్పుడు అదే హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఏం చర్యలు తీసుకుంటారో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసినప్పుడు కిషన్‌రెడ్డి హోం మంత్రిగా ఉన్నారని, ఎందుకు చర్యలు తీసుకోలేదని, నిఘా వ్యవస్థ ఏం చేస్తోందని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed