నాపై తప్పుడు వార్తలు రాయించింది మా పార్టీలోని కోవర్టులే: నందీశ్వర్ గౌడ్

by Satheesh |
నాపై తప్పుడు వార్తలు రాయించింది మా పార్టీలోని కోవర్టులే: నందీశ్వర్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాను బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారుతున్నట్లు తనపై తప్పుడు వార్తలు రాయించింది తమ పార్టీలోని కోవర్టులేనని బీజేపీ నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక చానల్ ఇంటర్వ్యూలో భాగంగా తాను కేవలం బీజేపీకి సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడానని, కాంగ్రెస్ పేరు కూడా ఎత్తలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ ఒక ప్రింట్ మీడియాలో తాను కాంగ్రెస్‌కు మారుతున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తూ కథనాన్ని ప్రచురించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

తాను పార్టీ మారుతున్నట్లు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గానికి చెందిన తనపై ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదని, దీన్ని తీవ్రంగా ఖండించారు. విలువలు కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రచురిస్తే మీడియాపై ఉన్న నమ్మకం కూడా కోల్పోతారని ఫైరయ్యారు. కాంగ్రెస్ అన్న పదం కూడా తాను ఎత్తలేదని, ఆ పార్టీ జాకీలు పెట్టి లేపినా లేవట్లేదని ఎద్దేవాచేశారు. అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ అని, కర్ణాటక లో బీజేపీ ఓడిపోవడానికి ఎన్నో కారణాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కర్ణాటకలో గెలిచినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందా? అని, అలాంటి పగటి కలలు ఆ పార్టీ నేతలు కనొద్దని ఆయన చురకలంటించారు.

అసలు ముసళ్ల పండుగ ముందుందని నందీశ్వర్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలపై పోరాడుతున్న పార్టీ ఏకైక పార్టీ బీజేపీ అని, కాంగ్రెస్ ఎక్కడ పోరాడిందో చూపించాలని ఆయన ప్రశ్నించారు. తన చివరి శ్వాస వరకు బీజేపీలోనే కొనసాగుతానని ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌ను వీడి నాలుగేండ్లు దాటిందని, ముగ్గురు.. నలుగురు కోవర్టుల్లో ఒకరు తాను పార్టీ మారుతున్నట్లు కావాలని రాయించారని, ఆ కోవర్టులు ఇప్పటికైనా వారి పద్ధతి మారకపోతే పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే వారి పేర్లను ప్రకటిస్తానని నందీశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే నాయకత్వం దృష్టికి తీసుకెళ్లానని, వారి దృష్టిలో ఈ అంశం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనే దొంగ కొద్ది మందికి ఆశ చూపి కోవర్టులుగా మార్చుకున్నారని నందీశ్వర్ గౌడ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story