- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Harish Rao: కేసీఆర్ జాతి పిత.. రేవంత్ బూతు పిత

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ జాతి పిత.. రేవంత్ బూతు పిత అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ రేవంత్ రెడ్డిది అని అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటున్న రేవంత్‌రెడ్డికి సంస్కారం ఉన్నదా అని ప్రశ్నించారు. ‘నీ వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతున్నది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి మాట సమర్థించుకుంటున్నావని.. సిగ్గుంటే కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీపై చర్చకు సిద్ధం
‘మధిరకు పోదామా? కొడంగల్ పోదామా? సిద్దిపేట పోదామా? ఏ ఊరుకు పోదాం? సంపూర్ణ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. లేదంటే మీరు రాయండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎప్పటిలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తావో చెప్పు రేవంత్?’ అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. రేవంత్ ఇచ్చిన ఉద్యోగాలు 7వేలు కూడా దాటలేదని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండకేసి కొట్టారని అన్నారు. 15 నెలలకే రాష్ట్రానికి భారంగా మారారన్నారు. ప్రజలు పులుసు తీస్తరని హెచ్చరించారు. అలాగే.. కృష్ణా జలాల్లో 70% వాటా సాధించడానికి మార్గం సుగమం చేసిందే కేసీఆర్ అని.. అసెంబ్లీ వేదికగా రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు. నాడు నీటి వాటాను అడ్డుకున్న ఏపీ వ్యక్తిని నేడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్న నీచ చరిత్ర రేవంత్ రెడ్డిదని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతలను జూరాల వద్ద కట్టమని చెబుతున్నారని.. కనీస అవగాహన లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. జూరాల కేపాసిటీ 9 టీఎంసీలు అని.. 5.50 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే అని, పాలమూరు అంటే రోజుకు 2 టీఎంసీల ఎత్తిపోతల ఎట్లా అయితదని ప్రశ్నించారు. కృష్ణా జలాలు ఏపీకి తరలిపోవాలన్నదే సీఎం ఉద్దేశమా అని ప్రశ్నించారు. ఇది ఆంధ్రా సలహాదారుడు ఇచ్చిన సలహానా అని నిలదీశారు. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించేందుకు ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అందుకే.. మంత్రి ఉత్తమ్ సైతం విజయవాడ వెళ్లి చేపల పులుసు తిన్నారని అన్నారు. వరంగల్ వెళ్తున్న సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మేం పదవుల కోసం పోటీపడం..
కేటీఆర్, తాను పదవుల కోసం పోటీ పడబోమని, శనేశ్వరం లాంటి నిన్ను దించే దాకా, కేసీఆర్‌ను సీఎం చేసేదాకా పోటీ పడి పనిచేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా పోటీ పడి కొట్లాడుతామన్నారు. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అనేది పెద్ద బోగస్ అని అన్నారు. లక్షా 62 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ అని, శాఖల వారీగా లెక్కలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ లేకుండా అశోక్‌నగర్ లైబ్రరీ దగ్గరకు వచ్చే ధైర్యం ఉన్నదా అని సవాల్ చేశారు. ఉస్మానియాలో నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా? వందేళ్ల ఓయూలో ఇలాంటి ఆంక్షలు ఎన్నడూ లేవని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమా, ఎమర్జెన్సీ పాలనా? అని నిలదీశారు. ఆసుపత్రుల్లో గోళి లేదు, సూది లేదు, సిరప్ లేదని.. రేవంత్ పాలనలో నేను పోను బిడ్డో సర్కారు దవాఖాన అంటున్నారని ఎద్దేవా చేశారు. అప్పుల విషయంలోనూ సీఎం అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమే అని, తప్పుడు ప్రచారం చేస్తే లెక్కలతో సమాధానం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో చేసిన అప్పుల అసలు లెక్క మరో సందర్భంలో బయట పెడతానని చెప్పారు.