గోషామహల్ BJP అభ్యర్థి మార్పు.. రాజాసింగ్ స్థానంలో యువనేతకు ఛాన్స్!

by GSrikanth |   ( Updated:2023-04-02 06:45:31.0  )
గోషామహల్ BJP అభ్యర్థి మార్పు.. రాజాసింగ్ స్థానంలో యువనేతకు ఛాన్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోషామహల్ బరిలో దివంగత మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బరిలోకి దిగడం దాదాపు కన్ఫామ్ అయిపోయినట్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో గతకొద్ది రోజులుగా విక్రమ్ గౌడ్ సైలెంట్‌గా నియోజకవర్గ ప్రజలకు చేరువకావడంపై దృష్టిపెడుతున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు కావడంతో పార్టీ లైన్‌కు కట్టుబడి ఇన్నిరోజులు సైలెంట్‌గా నేతలను కలవడంపై దృష్టిసారించిన విక్రమ్ గౌడ్ శ్రీరామనవమి నుంచి తన యాక్టివిటీని ముమ్మరం చేసినట్లు సమాచారం. రాజాసింగ్ ప్రతిఏటా శోభాయాత్ర నిర్వహించినట్లే విక్రమ్ గౌడ్ సైతం అదే వేడుకను అస్త్రంగా చేసుకుని ప్రజలకు చేరువ కావడం, నియోజకవర్గంపై పట్టు సాధించడంపై దృష్టిసారిస్తున్నారు. మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో విక్రమ్ గౌడ్ తన యాక్టివిటీని పెంచేసినట్లు సమాచారం.


గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తన అనుచరులతోనూ ఈ విషయంపై పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది. అన్నీ ఓకే అనుకుంటే జహీరాబాద్ నుంచి బరిలోకి దిగే యోచనలో రాజాసింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో హిందువుల ఓట్లు ఎక్కువగా ఉండటంతోనే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో పలు వివాదాస్పద కామెంట్లు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికీ ఆ సస్పెన్షన్ అలాగే కొనసాగుతోంది. కాగా తాజాగా శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. ఆయనపై పలు కేసులు సైతం నమోదయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వివాదాస్పద కామెంట్లు చేయొద్దని హైకమాండ్ గతంలోనే ఆదేశించింది. కాగా తాజా వ్యాఖ్యలపైనా సంఘం పెద్దలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే రాజాసింగ్‌పై కొనసాగుతున్న సస్పెన్షన్ ఇప్పట్లో తొలిగేలా కనిపించడంలేదు. దీంతో పార్టీకి మరికొద్ది రోజులు దూరం కాక తప్పదనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా విక్రమ్ గౌడ్ శ్రీరామనవమి వేడుకలో భాగంగా గోషామహల్ నియోజకవర్గం పరిధిలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడి బస్తీ వాసులు విజ్ఞప్తి మేరకు అమ్మవారి ఆలయ నిర్మాణంతో పాటు వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి వారికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రి ముఖేశ్ గౌడ్ మిత్రులు, అనుచరులను కలిసి ఆప్యాయంగా పలకరించి మద్దతు కోరుతున్నారు. అంతేకాకుండా ఇటీవల జాంబాగ్ డివిజన్ కట్టెలమండిలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ వంటి కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాజాసింగ్ సస్పెన్షన్‌లో ఉండటం, వివాదాలు మరింత ఎక్కువ కావడంతో పార్టీకి మరికొద్ది రోజులు దూరం తప్పేలా లేకపోవడంతో విక్రమ్ గౌడ్‌కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందేమోనని పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే గోషామహల్‌లో యాక్టివిటీని పెంచేసినట్లు చెప్పుకుంటున్నారు.

Advertisement

Next Story