KCR సభకు రానందుకు రూ.500 ఫైన్.. మహిళలకు ప్రభుత్వం హెచ్చరిక

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-27 06:53:02.0  )
KCR  సభకు రానందుకు  రూ.500 ఫైన్.. మహిళలకు ప్రభుత్వం హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం రోజురోజుకు రసకందాయంలో పడుతోంది. పరస్పర విమర్శలతో రాజకీయం పదునెక్కుతోంది. తాజాగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య బహిరంగ సభల్లో బల ప్రదర్శనల కోసం వార్ నడుస్తోంది. జనసమీకరణ పెద్ద సవాల్ గా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకుంటే రూ.500 జరిమానా కట్టాలనే హుకూం జారీ చేసినట్లు వాట్సాప్ సందేశాలు పంపడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొంగరకలాన్ వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు పెద్ద ఎత్తున డ్వాక్రా గ్రూప్ లకు సంబంధించిన మహిళలు హాజరుకావాలని వాట్సాప్ సందేశాలు వచ్చాయనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.

సభకు రాకుంటే లోన్లు కట్

25వ తేదీన ఉదయం 11 గంటల వరకు అందరూ మున్సిపల్ ఆఫీస్ వద్దకు రావాలని, రాని వారి పేర్లు నమోదు చేసుకోబడుతాయని ఈ సందేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు సభకు రాని వారు జరిమానా కట్టడంతో పాటు భవిష్యత్ లో అలాంటి వారికి డ్వాక్రా గ్రూప్ ల ద్వారా లోన్లు రావని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్వాక్రా సంఘాల మహిళలకు సందేశాలు వచ్చాయనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో రంగారెడ్డి జిల్లాలో ఈ టాపిక్ దుమారం రేపుతోంది. ఈ సమావేశానికి కొందరు మహిళలు హాజరుకాకపోవడంతో తమ గ్రూప్ లీడర్ల వద్దకు వెళ్లి జరిమానా సైతం కట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

భగ్గుమన్న బీజేపీ

ముఖ్యమంత్రి సభకు రాకుంటే జరిమానా విధిస్తామనే విషయంలోపై ప్రచారం బయటకు పొక్కడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు, బీజేపీ మహిళా కార్పొరేటర్లు శుక్రవారం బడంగ్ పేట మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సైతం అందజేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అభిమానంతో సభలకు రావాలి కాని ఇలా బలవంతంగా రప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీటింగ్ కు బెదిరించి మహిళా సంఘాలకు చెందిన వారిని తరలించడం సిగ్గుచేటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

కేంద్రం బాటలో సీఎం KCR.. అదే ఫార్ములాతో బీజేపీకి బ్రేక్

Advertisement

Next Story