తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. కొత్త వ్యవస్థకు శ్రీకారం

by Gantepaka Srikanth |
తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. కొత్త వ్యవస్థకు శ్రీకారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతీ కుటుంబానికి ఒక ‘ఫ్యామిలీ డిజిటల్ కార్డు’ ఉండాలనే విధానంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నది. రేషను కార్డుగా, వైద్యారోగ్య కార్డుగా, హెల్త్ ప్రొఫైల్ కార్డుగా, సంక్షేమ పథకాలకు అర్హత కలిగినదిగా దీన్ని భావించేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు వ్యవస్థను అమలులోకి తేవాలని భావించింది. ఇకపైన ప్రభుత్వపరంగా ఏ వెల్ఫేర్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలన్నా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండడం తప్పనిసరి షరతుగా పెట్టనున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింతో పాటు పౌరసరఫరాల, వైద్యారోగ్య శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం రివ్యూ చేసిన సందర్భంగా ఈ అంశాన్ని వెల్లడించారు. ఈ కార్డులను జారీ చేయడానికి ముందే కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. ప్రతీ కుటుంబానికి ఈ కార్డుల్ని ఇవ్వాలనుకుంటున్నందున ప్రయోగాత్మకంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక గ్రామాన్ని, మరో పట్టణాన్ని ఎంపిక చేసి కార్యాచరణను మొదలుపెట్టాలని సూచించారు.

అర్హులైనవారందరికీ ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాల ఫలాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నందున అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానాన్ని అవలంబించడంపై ఈ సమావేశంలో సీఎం చర్చించారు. ఒకే కార్డు ద్వారా ప్రభుత్వం తరఫున రేషను, వైద్యారోగ్య చికిత్స, సంక్షేమ పథకాల ఫలాలను అందించాలని నిర్ణయించింది. ఈ కార్డు ద్వారానే లబ్ధిదారులు ఎక్కడినుంచైనా రేషను వస్తువులను తీసుకోవచ్చని, ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చని, ఆ దిశగా ఉపయోగపడేలా ఈ కార్డులు ఉండాలని స్పష్టం చేశారు. వైద్యారోగ్య అవసరాలకు చికిత్స పొందే సమయానికి సదరు వ్యక్తికి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఈ డిజిటల్ కార్డు ద్వారా డాక్టర్లు తెలుసుకునే వెసులుబాటు కూడా ఉండాలన్నారు. దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఈ కార్డు కీలకంగా ఉంటుందన్నారు. కుటుంబాల్లో సభ్యులు మారుతూ ఉంటారని, పుట్టే పిల్లలతో కొత్తగా పేర్లు నమోదవుతుంటాయని, పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ కుటుంబం నుంచి వేరుగా వెళ్ళి మరో కుటుంబంగా తయారవుతుందని, ఇలాంటి వివరాలన్నీ ఆ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని సూచించారు.

రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి వ్యవస్థ పనిచేస్తున్నందున అక్కడికి వెళ్ళి నిశితంగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల వ్య‌వ‌స్థ పర్యవేక్షణకు జిల్లాలవారీగా ప్రత్యేక వ్యవస్థల‌ను ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఈ స‌మావేశంలో మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ డీఎస్ చౌహాన్‌, ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి క్రిస్టినా చొంగ్తూ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి అధికారుల బృందం నివేదిక సమర్పించనున్నది. దాన్ని పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులు చేర్పులపై ప్రభుత్వం ఆలోచించి నిర్దిష్ట నిర్ణయాన్ని తీసుకోనున్నది.

Next Story

Most Viewed