తెలంగాణలో ‘ఫర్జీ’ గ్యాంగ్స్.. విచ్చలవిడిగా ఫేక్ కరెన్సీ చలామణి!

by GSrikanth |
తెలంగాణలో ‘ఫర్జీ’ గ్యాంగ్స్.. విచ్చలవిడిగా ఫేక్ కరెన్సీ చలామణి!
X

బిజీ షాపింగ్ మాల్స్, నైట్ మార్కెట్స్‌ను టార్గెట్ చేస్తారు. ఏజెంట్లను నియమించుకొని నకిలీ నోట్లను చలామణి చేస్తారు. హైదరాబాద్ కేంద్రంగా ఫేక్ కరెన్సీని మార్చే ముఠాలు ఎక్కువయ్యాయి. కోట్ల రూపాయల్లో ఈ దందా కొనసాగిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో పలు ముఠాలు దొరికినా.. ఈ ‘నకిలీ’ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నది.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాష్ర్టంలో నకిలీ నోట్ల చలామణి విచ్చలవిడిగా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. వివిధ రాష్ట్రాలకు చెందిన గ్యాంగులు పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీని తయారు చేస్తూ మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దొరక్కుండా ఉండటానికి రద్దీగా ఉండే షాపింగ్ మాళ్లు, దుకాణాలు, నైట్ బజార్లలో వీటిని వాడకంలోకి తీసుకువస్తున్నారు. నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ ప్రకారం దేశవ్యాప్తంగా గతేడాది రూ. 300 కోట్లకు పైగా నకిలీ కరెన్సీని దర్యాప్తు సంస్థలు సీజ్ చేశాయి. అయితే దీనికి మూడు రెట్ల కంటే ఎక్కువగా నకిలీ కరెన్సీ చలామణిలో ఉంటుందని సీనియర్ పోలీసు అధికారులే అభిప్రాయపడుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై దుష్ర్పభావం చూపిస్తుందని, ముఖ్యంగా నిరుపేద, మధ్యతరగతికి చెందిన ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు.

ఏజెంట్లను నియమించుకొని..

2016లో నోట్ల రద్దు తర్వాత నకిలీ కరెన్సీ వినియోగం కాస్త తగ్గినట్లు ఎన్సీబీ రికార్డులు చెబుతున్నాయి. అయితే గత రెండేళ్లుగా మళ్లీ ఎక్కువైనట్లు భావిస్తున్నారు. గతంలో పాకిస్తాన్ లో ఈ నకిలీ కరెన్సీని ప్రింట్ చేసి తీసుకువచ్చేవారు. అయితే ఇప్పుడు స్థానికంగానూ తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పలు ముఠాలు ఏజెంట్లను నియమించుకొని మరీ ఈ ‘నకిలీ’ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇటీవల సైబరాబాద్ పోలీసులు నకిలీ నోట్లు చలామణి చేసే ఓ ముఠాను అరెస్టు చేశారు. నిందితులను విచారిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. లక్ష రూపాయలకు మూడు లక్షల రూపాయల నకిలీ నోట్లను అందజేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు ఈ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు నకిలీ కరెన్సీ చలామణిలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

గుర్తించకపోతే చేటే..

నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న గ్యాంగులు ఎక్కువగా రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లను చలామణి చేస్తున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. తరచూ దాడులు చేస్తున్నా కొత్తగా పుట్టుకొస్తున్న గ్యాంగులు ఈ దందాను కొనసాగిస్తూనే ఉంటున్నాయన్నారు. నకిలీ కరెన్సీ లావాదేవీలకు అడ్డుకట్ట పడాలంటే అప్రమత్తంగా ఉండటమే మార్గమని వివరించారు. నోట్ల ప్రింటింగ్ సమయంలో అనేక అంశాల్లో ఆర్బీఐ జాగ్రత్తలు తీసుకుంటుంది. వాటర్ మార్క్, లేటెంట్ ఇమేజ్, ఇంటాగ్లియో మార్క్, ఫ్లోరెన్స్, సీ త్రూ రిజిష్టర్, సెక్యూరిటీ థ్రెడ్, మైక్రో లెటరింగ్, ఐడెంటిఫికేషన్ మార్క్, ఆప్టికల్లీ విజబుల్ ఇంక్ తదితర మార్కులు నోట్లపై ఉంటాయి. కాగితం కూడా చేత్తో పట్టుకుంటే అసలుదా? కాదా? అన్నది తెలిసిపోయేలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నకిలీ కరెన్సీని వివిధ ముఠాలు తయారు చేస్తున్నాయి. ఒరిజినల్ కాగితానికి దగ్గరగా ఉండే కాగితాన్ని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించుకొని నకిలీ కరెన్సీని తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. నిశితంగా గమనిస్తే తప్ప ఈ నకిలీ నోట్లను గుర్తుపట్టలేం. అయితే బిజీగా లావాదేవీలు జరిగే ప్రాంతాలను ముఠాలు టార్గెట్ చేసి నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నాయి.

Advertisement

Next Story