ప్రభుత్వ టీచర్లకు ఫేస్ రికగ్నైజేషన్! త్వరలోనే ఇంప్లిమెంట్

by Sathputhe Rajesh |
ప్రభుత్వ టీచర్లకు ఫేస్ రికగ్నైజేషన్! త్వరలోనే ఇంప్లిమెంట్
X

ప్రభుత్వ టీచర్లు పాఠశాలకు హాజరయ్యారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు సర్కారు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బయోమెట్రిక్‌ను అమలు చేస్తున్నా.. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల అది పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం లేదు. దీంతో ‘ఫేషియల్ రికగ్నిషన్’ అనే కొత్త పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్లు మొబైల్ ద్వారా తమ అటెండెన్స్ వేసేందుకు ఓ యాప్‌ను డిజైన్ చేయించింది.

ఇక పాఠశాలలో ఉన్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయులు యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకునేందుకు వీలుంటుంది. ఇతర ప్రాంతాల్లో ఉండి హాజరు వేయడం కుదరదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సర్కారు భావిస్తున్నది. దీని వల్ల తమ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళ్తే అవి మిస్ యూజ్ కావనే గ్యారంటీ ఏంటనే చర్చ ఉపాధ్యాయుల్లో మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : సర్కారు టీచర్లు పాఠశాలలకు అటెండ్ కావడంలో తరచూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తేనున్నది. ప్రస్తుతం అమలవుతున్న బయోమెట్రిక్ స్థానంలో ఇకపైన ‘ఫేషియల్ రికగ్నిషన్’ అనే కొత్త పాలసీ అమలు చేయనున్నది. ఈ విధానంతో టీచర్లు ఇకపై సరికొత్త సవాళ్లు ఎదుర్కోబోతున్నారు.

ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న స్కూలు ప్రాంగణం నుంచే ప్రతిరోజూ అటెండెన్సును వారి వ్యక్తిగత మొబైల్ ఫోన్ నుంచి నమోదు చేయాల్సి ఉంటుంది. ఎలాగూ స్కూల్స్ జియోటాగింగ్ అయినందున ఆ డాటకు అనుగుణంగా టీచర్ల అటెండెన్స్ నమోదు కానున్నది. ఫిజికల్ అటెండెన్స్ రిజిస్టర్ విధానంతో చోటుచేసుకుంటున్నఅవకతవకలను నివారించడానికి ప్రభుత్వం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నది.

ముందుగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో జిల్లాల్లో..

ముందుగా ఈ విధానాన్ని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అమలు చేయాలని సర్కారు భావిస్తున్నది. దీని ఆపరేషన్, వినియోగం, మ్యాపింగ్‌పై త్వరలో ప్రతి స్కూల్ నుంచీ ఆథరైజ్డ్ స్టాఫ్, నోడల్ ఆఫీసర్లకు, డిపార్టుమెంట్ అథారిటీస్, అడ్మిన్ యూజర్లకు వేర్వేరుగా వచ్చే నెలలోనే శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నది.

పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడానికి ముందే టీచర్ల ఫొటోలను సెల్ఫీ ద్వారా తీసుకుని యాప్‌లో అప్‌లోడ్ చేసి వారి ఐడీ నంబరు, పనిచేస్తున్న స్కూల్, దాని యూ-డైస్ కోడ్ నంబర్ తదితరాలన్నింటినీ ఫీడ్ చేయాల్సి ఉంటుంది. యూజర్ లాగిన్, పాస్ వర్డ్, ఒకవేళ మర్చిపోతే రీసెట్ చేసే ఫెసిలిటీ కూడా యాప్‌లో ఉంది. మొబైల్ సిగ్నల్స్ సరిగా లేని మారుమూల ప్రాంతాల్లోని వారికి మాత్రం ప్రత్యేకంగా కొన్ని మినహాయింపులు ఉండనున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు

ఏపీ, గుజరాత్, ఢిల్లీ, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో ఫేషియల్ రికగ్నిషన్ విధానం ఇప్పటికే అమలవుతున్నది. తమిళనాడులో పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ఎంపికచేసిన స్కూళ్లలో అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం నిర్మల్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిందని, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున రాష్ట్రమంతటా అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి ఒకరు తెలిపారు.

అటెండెన్స్ నమోదు ప్రక్రియను, డేటాను పకడ్బందీగా విశ్లేషించడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను, కంట్రోల్ సెంటర్‌ను, వివిధ శాఖలతో సమన్వయం చేసుకునే మెకానిజాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. టీచర్లతో మొదలుపెట్టే ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని భవిష్యత్తులో విద్యార్థులకు, మధ్యాహ్న భోజన పథకం అమలుకు కూడా వినియోగించేలా ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచిస్తున్నది.

ఈ విధానం ఎందుకు?

స్కూల్ హెడ్‌తో ఉన్న సంబంధాలను అనుకూలంగా మల్చుకుని టీచర్లు పాఠశాలకు రాకుండానే.. వచ్చినట్టు మ్యానెజ్ చేస్తున్నారనే ఆరోపణలు విద్యాశాఖలో నెలకొన్నాయి. మాన్యువల్ అటెండెన్స్ విధానంలో ఉన్న ఈ లొసుగులను సవరించడానికి బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. టెక్నికల్ సమస్యలతో ఇది చాలాచోట్ల పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత సంతృప్తికరమైన ఫీడ్‌బ్యాక్ రావడంతో రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రమంతా దీనిని అమలుచేయాలని సర్కారు నిర్ణయాన్ని తీసుకున్నది.

రాష్ట్రంలోని స్కూళ్లన్నీ ఇప్పటికే జియో టాగింగ్ అయినందున వాటిల్లో పనిచేస్తున్న టీచర్ల వివరాలను ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేసి ఆ ప్రాంగణం నుంచి అటెండెన్స్ ఇస్తేనే ఓకే అయ్యేలా ప్రభుత్వం సాంకేతికంగా ఆలోచిస్తున్నది. టీచర్లు స్కూలుకు రాకుండానే మరో ప్రాంతం నుంచి మొబైల్ ద్వారా అటెండెన్స్ వేసినా అది వెంటనే మానిటర్ చేసేవారిని అలర్టు చేసే విధానం కూడా ఈ కొత్త మెకానిజంలో ఉండనున్నది. దీని వల్ల టీచర్లలో జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు వారి ఫిజికల్ హాజరును తప్పనిసరి చేయవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన.

టీచర్లు చేయాల్సిందేంటి?

ఫేషియల్ రికగ్నిషన్ విధానం రెండు రూపాల్లో అమలవుతుంది. ఇండివిడ్యువల్‌గా టీచర్లు వారి సొంత మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని స్కూలులోని తరగతి గతికి వెళ్లి ఆ యాప్ ద్వారా అటెండెన్స్ వేయాలి. మొబైల్ ఫోన్‌లోని ఫ్రంట్ కెమెరా ద్వారా వారి ఫేస్‌ను ఆ యాప్ రికగ్నైజ్ చేస్తుంది. అంతా సవ్యంగా జరిగిన తరవాత అటెండెన్స్ నమోదైనట్టు తేలుతుంది. ఆ స్కూలులో ఎవరెవరు ఆబ్సెంట్ అయ్యారనే వివరాలు కూడా ఆ సమయానికి తెలుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్ల అటెండెన్స్ యాప్ ద్వారా ప్రతిరోజూ నమోదవుతుంది. మొత్తం పది సెకన్ల పాటు అటెండెన్స్ ప్రక్రియ ఉంటుంది. డ్యూటీ ముగిసిన తర్వాత వెళ్లేటప్పుడూ యాప్ ద్వారా ఆ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

మరో రూపంలో గ్రూపుగా కూడా ఆ స్కూలులో ఆథరైజ్డ్ సిబ్బంది అటెండెన్స్ తీసుకుంటారు. ఒకేసారి ఇరవై మందిని గ్రూపుగా చేర్చి యాప్ ద్వారా దీన్ని పూర్తిచేయాలి. ఒక్కోసారి అవసరమైతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒకే రోజులో నాలుగుసార్లు కూడా టీచర్ల అటెండెన్స్ తీసుకునేందుకు యాప్‌లో ఫెసిలిటీ ఉండేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. భవిష్యత్తులో ఈ యాప్‌లోని డేటాను ఇతర ప్రభుత్వ విభాగాలు వేర్వేరు అవసరాలకు వాడుకునే ఆలోచన కూడా ఉన్నది. త్వరలో విద్యార్థుల అటెండెన్స్ కూడా ఇదే పద్ధతిలో అమలుచేయడానికి ఇప్పుడే కసరత్తు జరుగుతున్నదని, దానికి తగినట్లుగా యాప్‌ డిజైన్ జరుగుతున్నదని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

అమలులో ఎదురయ్యే చిక్కులు

ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని గతేడాది ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నది. రోజువారీ వాడకంలో ఎదురవుతున్న టెక్నికల్ ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తీవ్ర స్థాయిలో టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు మొదట్లో వారి వివరాలను యాప్‌/సాఫ్ట్ వేర్ లో నమోదు చేసిన తర్వాత ఫేస్ లో ఏమైనా మార్చులు వస్తే అటెండెన్స్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది ఉపాధ్యాయుల ఆరోపణ.

తొలుత డేటా వివరాలను ఫొటోతో సహా నమోదు చేసిన తర్వాత గుండు చేయించుకోవడం, టోపీ పెట్టుకోవడం, మీసాలు-గడ్డం పెంచుకోవడం లేదా తీసేయడం వంటివి జరిగినప్పుడు ఆటెండెన్స్ విషయంలో తేడాలొస్తున్నట్టు ఏపీ అనుభవంలో తేలింది. దీన్ని గమనంలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వాటిని సరిచేసే తీరులో టెక్నాలజీలో మార్పులు చేయాలని భావిస్తున్నది.

ఢిల్లీలో కోర్టుకెక్కిన విధానం

ఢిల్లీ సర్కారు ఉపాధ్యాయులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా అటెండెన్స్ తీసుకోవడాన్ని 2021 ఆగస్టు నుంచే మొదలుపెట్టింది. ఇందులోని కొన్ని సంక్లిష్టమైన అంశాలతో విభేదించిన రెండు ఉపాధ్యాయ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. గతంలో పుట్టస్వామి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు డేటా ప్రైవసీ పాలసీపై వెలువరించిన జడ్జిమెంట్‌లోని అంశాలను ప్రస్తావించాయి. అప్పటికి రెండేండ్ల ముందు 700 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ఢిల్లీ హైకోర్టులో వివాదం నడిచింది. చివరకు విద్యార్థుల భద్రత కోసం పెట్టిన సీసీటీవీ విధానాన్ని తప్పుపట్టలేమని పేర్కొన్న హైకోర్టు ఆ ప్రాజెక్టును కంటిన్యూ చేయడానికి అనుమతించింది.

థర్డ్ పార్టీ చేతుల్లోకి డేటా ప్రైవసీ

ఈ అటెండెన్స్ విధానాన్ని తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ విభాగం తరఫున థర్డ్ పార్టీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో టీచర్ల వ్యక్తిగత వివరాలు, ఫొటోలు థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళ్తే అవి మిస్ యూజ్ కావనే గ్యారంటీ ఏంటనే చర్చ ఉపాధ్యాయుల్లో మొదలైంది. మొబైల్ ఫోన్లలోని వివరాల ఆధారంగా వారు ఏ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు లాంటివన్నీ ప్రభుత్వం, థర్డ్ పార్టీ మానిటర్ చేయడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లే ప్రమాదముందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర విద్యాశాఖ మాత్రం టీచర్ల ఫొటోలు, వీడియోలు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌లో ఎక్కడా సేవ్ కావని చెబుతున్నది. ఉపాధ్యాయుల అటెండెన్స్‌ను రెగ్యులర్‌గా మానిటర్ చేస్తూ ఆబ్సెంట్ అయినవారికి ఎప్పటికప్పుడు అలర్ట్ పంపించాలన్నదే ప్రధాన ఉద్దేశమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భవిష్యత్తులో విద్యార్థులకు కూడా ఈ విధానాన్ని అమలుచేస్తే పిల్లలు స్కూలుకు ఆబ్సెంట్ అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయడానికి దోహదపడుతుందని విద్యాశాఖ వర్గాలు వివరించాయి.

అనేక రాష్ట్రాల్లో ఈ సాఫ్ట్ వేర్ వినియోగం

ప్రస్తుతం విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నా.. పోలీసులు మాత్రం దీన్ని చాలాకాలంగా నేర నివారణలో వినియోగిస్తున్నారు. టీఎస్ కాప్ అనే ఫెసిలిటీ ద్వారా వేలిముద్రలను, ఫేస్ డీటెయిల్స్‌ను సేకరిస్తున్నారు. 360 డిగ్రీస్ అనే పేరుతో ప్రత్యేక విశ్లేషణ కూడా జరుగుతున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 360 డిగ్రీ పేరుతో అమలుచేస్తున్నది. ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ త్రినేత్ర పేరుతో అమలు చేస్తున్నది. ఒడిశా ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పేరుతో రద్దీ ప్రాంతాల్లో నేరస్తులను గుర్తించడానికి గతేడాది నుంచి అమలు చేస్తున్నది. ఢిల్లీ పోలీసులు కూడా సీసీటీవీల ద్వారా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed