తెలంగాణకు భవన్‌కు రావడమే మానేసిన కీలక నేతలు.. కేడర్ సీరియస్

by Gantepaka Srikanth |
తెలంగాణకు భవన్‌కు రావడమే మానేసిన కీలక నేతలు.. కేడర్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది పదవులు అనుభవించారు. అధికారం కోల్పోగానే వాళ్లంతా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణకు భవన్‌కు రావడమే మానేశారు. గతంలో ప్రతి రోజూ వచ్చి తమ పనులు చక్కబెట్టుకున్న నేతలు ఇప్పుడు అనుసరిస్తున్న తీరు చర్చకు దారితీసింది. ప్రభుత్వానికి టార్గెట్ అవుతామనా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది అర్థం కాని విషయం.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. యువతకు పెద్దపీట వేసింది. కార్పొరేషన్లలో యువతకు, యాక్టివ్‌గా పని చేసిన వారికి అవకాశం కల్పించింది. 80 మందికి పైగా కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించింది. వాళ్లందరూ పార్టీకి నిరంతరం అండగా ఉంటారని భావించింది. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందగా కార్పొరేషన్లకు చైర్మన్లుగా పని చేసిన వారు సైలెంట్ అయిపోయారు. తెలంగాణ భవన్‌కు రావడమే బంద్ చేశారు. 80 మందిలో కార్పొరేషన్ చైర్మన్లుగా పని చేసిన వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్, ఆంజనేయుగౌడ్, బాలరాజుయాదవ్, చిరుమిల్ల రాకేష్, రామచంద్రునాయక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సోమభరత్ కుమార్, రాజీవ్ సాగర్ మాత్రమే భవన్‌కు వస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అప్పుడప్పుడు వెంకటేశ్వర్ రెడ్డి, దేవీప్రసాద్, క్రిషాంక్, రవీందర్ సింగ్ ఇలా మరో ఒకరిద్దరు మాత్రమే వస్తున్నారు. ఇక మిగిలిన వారు అసలే రాకపోవడంతో వారి తీరు పార్టీలో చర్చనీయాంశమైంది.

ప్రభుత్వానికి టార్గెట్ అవుతామనా?

బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రజాసమస్యలపై గళమెత్తే సమయం. ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీసేందుకు కరెక్టు టైం. కానీ పార్టీ కార్పొరేషన్ చైర్మన్లుగా పని చేసిన వాళ్లు విమర్శలు చేయడంలో వెనుకబడ్డారనే ప్రచారం జరుగుతున్నది. భవన్‌కే రాని వారు ఇక ఏం విమర్శలు చేస్తారని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే టార్గెట్ అవుతామని భావిస్తున్నారా? లేక ఏమైనా బిజినెస్‌లు ఉంటే ఎఫెక్ట్ పడుతుందనా? అనేది అర్థం కావడం లేదని కొందరు నేతలు పేర్కొ్ంటున్నారు.

నాడు పదవుల కోసం నిత్యం ప్రదక్షిణలు

గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భవన్‌లో సందడి ఉండేది. నిత్యం వందలాది మంది యువనేతలు వచ్చేవారు. కార్పొరేషన్లలో, ఇతర కమిటీల్లో అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తులు చేసేవారు. పదవులు వచ్చేవరకు కంటిన్యూగా వచ్చేవారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్లందరూ ఇప్పుడు భవన్‌కు రాకుండా దూరంగా ఉంటున్నారు. ఉద్యమ సమయంలో పనిచేసిన సీనియర్ నేతలను సైతం కాదని.. కొంత మందికి పార్టీ అధిష్టానం అవకాశాలు కల్పించింది. అయినా వారు పార్టీ కార్యాలయానికి రాకపోవడంతో అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

పనిచేసే వారికే పదవులు ఇవ్వాలంటున్న కేడర్

పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇవ్వాలనే డిమాండ్ తాజాగా మరోమారు తెరమీదకు వచ్చింది. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి ఎవరు అండగా ఉన్నారు? పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఎవరు విజయవంతం చేశారు... అనే వివరాలను పరిగణలోకి తీసుకొని అవకాశాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. వలసవాదులకు అవకాశం ఇవ్వొద్దని, పార్టీలో యాక్టివ్‌గా పనిచేయని వారిని సైతం దూరంపెట్టాలని కార్యకర్తలు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed