కొణిజేటి రోశయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి

by Kalyani |
కొణిజేటి రోశయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి
X

దిశ, శేరిలింగంపల్లి : ఆంధ్రరాష్ట్ర ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మూడో వర్ధంతి సభ బుధవారం హైటెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ, టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లనే రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య నాకు సూచించారని, చట్ట సభల్లో అనాటి స్పూర్తి కొరవడిందని, ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయని సీఎం అన్నారు.

శాసనమండలి, శాసనసభలో పోటీ పడి స్పీచ్ ఇవ్వాలన్న స్ఫూర్తిని రోశయ్య మాకు ఇచ్చారని, చుక్క రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, రోశయ్య లాంటి వారి మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీగా మాట్లాడేందుకు నేను భయపడ్డానని, నీటి పారుదల శాఖ పైన మండలిలో తాను మాట్లాడినప్పుడు రోశయ్య నన్ను తన ఛాంబర్ కు పిలిపించుకొని ప్రోత్సహించారని నాటి విషయాలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష సభ్యుడినైనప్పటికి మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారని, అది ఆయన హుందాతనమని అన్నారు. సీఎంగా, గవర్నర్ గా, వివిధ హోదాల్లో 50 యేళ్లకు పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారని, తమిళనాడు గవర్నర్ గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు, కానీ రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారని తెలిపారు.

అ నాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజంలా వ్యవహారించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారని, అలాంటి గొప్పతనం రోశయ్యదని అన్నారు. రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటన్న సీఎం.. ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని రోశయ్య కంచె వేసి కాపాడేవారని, నెంబర్ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి స్థానం కోసం ఏ నాడు రోశయ్య తాపత్రయం పడలేదని, పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారని గుర్తు చేసుకున్నారు. రోశయ్య నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వచ్చాయని, సభలో సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కొవాలంటే రోశయ్య ఉండాలనే ముద్ర ఆయన బలంగా వేశారన్నారు. నేను హైదరాబాద్ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారని, హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.

రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్ఫూర్తి ఇచ్చినట్లవుతుందన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి రోశయ్య ఇంతగానో కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, వారు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆర్యవైశ్యుల ఎన్నో ఏళ్ల కల ఆర్యవైశ్య కార్పొరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉందని, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలన్నారు. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుందని సీఎం హామీ ఇచ్చారు.రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తామని తెలిపారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విలువలు, ప్రశాంత జీవితానికి చిరునామా రోశయ్య అని, రాజకీయ ఒడిదుడుకులు, ఉద్యమాలు ఎదుర్కొని ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు సహేతుక సమాధానాలు ఇస్తూ ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనుడు రోశయ్య అని భట్టి గుర్తు చేసుకున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, రోశయ్య జీవితం అందరూ అనుకున్నట్టు సజావుగా సాగలేదని, ఆయన రాజకీయంగా అనేక ఒడిదుడుకులు, రాజకీయ ఉద్యమాలకు తట్టుకొని ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారని అన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ విద్యార్థి నాయకుడి నుంచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్ రోశయ్య ఎదిగేందుకు దోహద పడిందని అన్నారు. రామ్ మోహన్ రావు, గంజి రాజమౌళి గుప్త, రామారావుకు రోశయ్య అవార్డ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గంజి రాజమౌళి గుప్త, రామ్ మోహన్ రావు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ అధ్యక్షుడు కట్ట రవి గుప్త, పాండు గుప్త, భువనగిరి శ్రీనివాస్, బిజ్జల నవీన్, ఆర్య వైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story