పర్మిషన్లు లేకున్నా అడ్మిషన్లు.. విద్యాశాఖ మంత్రి మౌనం ఎందుకు..?

by Sathputhe Rajesh |
పర్మిషన్లు లేకున్నా అడ్మిషన్లు.. విద్యాశాఖ మంత్రి మౌనం ఎందుకు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : గురునానక్​, శ్రీ నిధి యూనివర్సిటీలకు పర్మిషన్లు లేకున్నా.. అడ్మిషన్లు ఇచ్చారని ఎన్​ఎస్​యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్​లో మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయన్నారు. 2018లో 5 ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతిస్తూనే, 2021లో మళ్ళీ 6 యూనివర్సిటీల బిల్​లను పాస్ ​చేసిందని సర్కారుపై ఫైర్ అయ్యారు. యూనివర్సిటీ బిల్​ను గవర్నర్ ఆమోదించిన తర్వాతనే కొత్త యూనివర్సిటీలకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ రాష్ట్రం ప్రభుత్వం ఆ విధానాన్ని అనుసరించడం లేదన్నారు.

పర్మిషన్‌లేని యూనివర్సిటీల ఫంక్షనింగ్ ఆపాల్సిన బాధ్యత విద్యాశాఖకు ఉన్నప్పటికీ, మౌనంగా ఉన్నారని ఆరోపించారు. గవర్నర్ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ అనుమతితో యూనివర్సిటీలను ఫంక్షనింగ్ ఎలా? చేస్తారని ప్రశ్నించారు. పైగా రాజ్ భవన్ ముందు ధర్నా చేయాలని ప్రైవేటు యూనివర్సిటీ విద్యార్దులను యూనివర్సిటీ యాజమాన్యం రెచ్చగొడుతుందన్నారు. ఇంత జరుగుతుంటే సబితా ఇంద్రారెడ్డి సైలెంట్​గా ముందుకు సాగడం వెనక ఆంతర్యమేమిటనేది స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

యూనివర్సిటీలపై వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలలో చేరిన విద్యార్థులను ఇతర యూనివర్సిటీలలో చేరేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉన్నదన్నారు. గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీలపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే మే 2న సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed