ఈటల రాజేందర్ ఏఎన్ఎంలను రెచ్చగొడుతున్నారు: ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్

by Satheesh |
ఈటల రాజేందర్ ఏఎన్ఎంలను రెచ్చగొడుతున్నారు: ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తున్నాయని టీఎస్ఎంఎస్​ఐడీసీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక వేతనాలు మన రాష్ట్రంలో ఇస్తున్నామని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆశాలు, ఏఎన్ఎంల పరిస్థితి దారుణంగా ఉన్నదన్నారు. గత ప్రభుత్వాలకు ఆశాలు, ఎన్ఎంలు అంటే చిన్న చూపు అని, చాలీ చాలని జీతాలు, సకాలంలో చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడేవారన్నారు.

వెట్టి చాకిరితో ఎంతో మంది ఉద్యోగాలు మానేసిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. జీతాలు పెంచాలని నిరసనలు, ధర్నాలు చేసిన అక్క చెల్లెల్లపై గత ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించేవన్నారు. స్త్రీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర కూడా గత ప్రభుత్వాలదని విమర్శించారు. కానీ స్వరాష్ట్రంలో ఆశాలు, ఎఎన్ఎంలకు ఎలాంటి కష్టాలు, అవమానాలు లేకుండా సీఎం కేసీఆర్ చూసుకుంటున్నారని కొనియాడారు. జీతాలు పెంచాలని రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆత్మ గౌరవంతో జీవిస్తూ, ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఆశాలు, ఎఎన్ఎంలకు అవకాశం కల్పించారన్నారు.

2014-15లో ఏఎన్ఎంల వేతనం రూ. 10వేలు ఉంటే ఇప్పుడు 27,300 ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. జీవో నెంబర్ 510 జీవో ద్వారా ఏకంగా 58శాతం పెంచి, 12వేల నుంచి 21వేలకు పెంచిందన్నారు. 2021లో జీవో నెంబర్ 730 ద్వారా 30శాతం వేతనం పెంచి, 21వేలను 27,300లకు పెంచామన్నారు. అత్యధిక వేతనాలు అందిస్తూ అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది అన్నారు.

ఏఎన్ఎంలకు తెలంగాణ 27,300 ఇస్తుండగా, ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గరిష్ఠంగా ఇస్తున్నది కేవలం 17వేలు అని, మన పక్క రాష్ట్రమైన ఏపీలో 23,393 కాగా.. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇస్తున్నది కేవలం రూ. 18,523, తమిళనాడులో రూ. 18 వేలు మాత్రమే అని వివరించారు. ఈటెల రాజేందర్‌కు నిజంగా ప్రేమ ఉంటే, ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఇస్తున్నట్లుగా జీతాలు వచ్చేలా చూడాలన్నారు.

ప్రజల ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్‌లో నమోదు చేసుకునేందుకు వీలుగా ఏఎన్ఎంలకు ట్యాబ్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్న 1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎఎన్ఎంలకు ప్రత్యేక అవకాశం కల్పించిందన్నారు. వీరికి గరిష్టంగా 20 మార్కులు వెయిటేజీని కల్పించిందన్నారు.

పని చేసిన ప్రతి ఆరునెలల కాలానికి 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇవ్వగా, గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారికి 2.5 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇచ్చిందన్నారు. ఏఎన్ఎంల సంఘాల వినతులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పరీక్షను ఇంగ్లీష్ తో పాటు, తెలుగులోనూ నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా బట్టగాల్సి మీద వేసే చర్యలకు అరోగ్య మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ఉపక్రమించడం బాధాకరం అన్నారు.

Advertisement

Next Story