- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Election Year: ఎలక్షన్ ఇయర్ @ 2025.. సంక్రాంతి తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది సంక్రాంతి తరువాత మొదలయ్యే ఎన్నికల వేడి.. ఏడాది చివర వరకు కొనసాగే అవకాశమున్నది. ముందుగా జిల్లా, మండల పరిషత్, ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అవి పూర్తయిన వెంటనే గ్రాడ్యుయేట్, టీచర్, అసెంబ్లీ కోటాలోని మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇవి ముగిసిన కొన్ని రోజులకే మున్సిపల్ ఎన్నికలకు ముహుర్తం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ వరుస ఎన్నికలతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో బిజీబిజీగా గడపనున్నాయి.
సంక్రాంతి తర్వాత ‘లోకల్’ ఎన్నికలు
2025ను స్థానిక సంస్థల ఎన్నికల ఏడాదిగా చెప్పవచ్చు. గ్రామీణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఇప్పటికే పది నెలలు అయింది. జీపీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టడానికి అటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాగానే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో సంక్రాంతి తరువాత ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు, చిక్కులు ఎదురుకాకుంటే.. సంక్రాంతి తరువాత నుంచి వరుసగా స్థానికసంస్థల ఎన్నికల జరగనున్నాయి. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గుచూపుతున్నది. ఆ తరువాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 20 రోజుల సమయం సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు
రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి నెలాఖరు నాటికి, మరొకరి పదవీ కాలం ఏప్రిల్ చివరిలో పూర్తికానుంది. మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి రెండో వారం కల్లా నల్లగొండ, కరీంనగర్ టీచర్ నియోజకవర్గాలు, కరీంనగర్గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మార్చి లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. మార్చి రెండో వారంకల్లా హైదరాబాద్ స్థానిక సంస్థల షెడ్యూల్ రానుంది. ఈ తొమ్మిది స్థానాల్లో ఎవరిని అదృష్టం వరించనుందో వేచి చూడాల్సిందే.
రిపబ్లిక్ డే తరువాత స్పెషల్ ఆఫీసర్లు
ఈనెల 26 తరువాత గ్రేటర్ హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ఉన్న మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీ కాలం ముగియనుంది. వెంటనే వీటికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. ఎందుకంటే గతేడాది ఫిబ్రవరిలో పదవీ కాలం ముగిసిన గ్రామీణ స్థానిక సంస్థలు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. వీటికి ఈ సంక్రాంతి తరువాత ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకని జనవరి 26 తరువాత పదవీ కాలం ముగిసే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
దసరా తరువాత మున్సిపల్ ఎన్నికలు!
ముందుగా గ్రామీణ స్థానిక సంస్థలు, ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి దసరా తరువాతే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో టాక్ ఉంది. అప్పటివరకు వాటికి స్పెషల్ ఆఫీసర్లతో పాలన వ్యవహారాలను నడిపించనున్నారు. ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాల్టీల పాలక మండళ్ల పదవీ కాలం ముగియనుంది.
వరుసగా ఎన్నికల కోడ్
ఈ ఏడాది వరుస ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండే అవకాశాలు ఉన్నాయి. రూరల్ లోకల్ బాడీస్ ఎన్నికలను పూర్తి చేసేందుకు కనీసం 20 రోజుల పాటు సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. అంటే షెడ్యూలు ఇచ్చినప్పటి నుంచి కొత్త పాలక మండళ్ల బాధ్యతలు తీసుకునే వరకు కోడ్ అమల్లో ఉండనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కనీసం 40 రోజులుపాటు ఎన్నికలు జరిగే జిల్లాల్లో కోడ్ అమల్లో ఉంటుంది. ఇవి ముగిసిన తరువాత అర్బన్ స్థానిక సంస్థలు నిర్వహించే సమయంలో మళ్లీ ఎన్నికల కోడ్ రానుంది.
పార్టీలకు చాలెంజ్
రూరల్, అర్బన్ స్థానిక సంస్థల్లో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చాలెంజ్ గా తీసుకోనున్నాయి. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో సైతం తమ కేడర్ ను గెలిపించుకునేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. లేకపోతే గ్రామాల్లో పార్టీ ఉనికికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. అలాగే పార్టీ గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్, కౌన్సిలర్ ఎన్నికలను మూడు పార్టీలు సీరియస్ గా తీసుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన పార్టీలే ఆయా జిల్లాల్లో రాజకీయంగా పైచేయి సాధిస్తుంటాయి.