ఈడీ కేసీఆర్ ఇంటి తలుపు తట్టడం ఎంతో దూరంలో లేదు

by Nagaya |   ( Updated:2022-08-08 10:19:01.0  )
ఈడీ కేసీఆర్ ఇంటి తలుపు తట్టడం ఎంతో దూరంలో లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి తలుపును ఈడీ అధికారులు తట్టడం ఎంతో దూరంలో లేదని, అందుకే ఆయన కేంద్రంపై దుష్ర్పచారం చేస్తున్నాడని బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ చార్జీ మురళీధర్ రావు అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తప్పు చేశాననే భయం ఉండటం వల్లే.., ముందస్తుగానే ఇలా సింపతీ కోసం ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శలు చేశారు. ఈడీ, ఇన్ కం టాక్స్ విషయంలో బీజేపీ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ అవినీతిపై విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, డాలర్‌తో రూపీ పతనంపై కేసీఆర్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

నీతి ఆయోగ్ నిరార్ధకమని చెప్పి ఆ సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బహిష్కరించారన్నారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులెవరూ అలా చేయలేదని గుర్తుచేశారు. నీతి అయోగ్ సమావేశంలో క్రాప్ డైవర్షన్, జీఎస్టీ ట్యాక్స్‌లు కొన్నింటిపై తీసేయాలని చర్చించారని వెల్లడించారు. విదేశీమారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నా.. ఆర్థిక సంక్షోభం వైపు దేశం వెళ్లడం లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఆర్థిక శాస్త్రం తెలియదని మురళీధర్ రావు ఎద్దేవాచేశారు. తుపాకి రాముడి ముచ్చట్లు చెబుతున్నారని మండిపడ్డారు. 8 ఏళ్లలో బ్యాంకులకు చెల్లించాల్సిన మొండి బకాయిలను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందని తెలిపారు. అనేక రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, ఉచిత పథకాలపై తాము ఒక్క రాష్ట్రాన్ని ఉద్దేశించే మాట్లాడలేదని తెలిపారు. కార్పొరేట్ లోన్లు ఎక్కడ మాఫీ చేయలేదని వెల్లడించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ తప్పుడు రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించారని, ఈ యుద్ధంలో కేసీఆర్‌కు ఓటమి ఖాయమని మురళీధర్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సర్టిఫై చేసినంత మాత్రాన ఆ ప్రాజెక్టు అవినీతిని సర్టిఫైడ్ చేసినట్లా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్‌లో భూకంపం రాబోతుందని మురళీధర్ రావు జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తే ఆగే పరిస్థితి లేదని హెచ్చరించారు. గులాబీ పార్టీలో అతి త్వరలో అసమ్మతి బాంబ్ బ్లాస్ట్ అవుతుందని తెలిపారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదని స్పష్టంచేశారు. సిద్దిపేట ప్రజలు రగిలిపోతున్నారని, ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చలేదని మండిపడ్డారు. సిద్దిపేట చౌరస్తాలో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, హరీశ్ రావు అక్కడ ఓడిపోవడం ఖాయమని నొక్కిచెప్పారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక?

Advertisement

Next Story

Most Viewed