పోటాపోటీ కంప్లైంట్స్.. బీఆర్ఎస్‌కు మరో నోటీస్ జారీ చేసిన ఈసీ

by Satheesh |
పోటాపోటీ కంప్లైంట్స్.. బీఆర్ఎస్‌కు మరో నోటీస్ జారీ చేసిన ఈసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్కాంగ్రెస్ పేరుతో పత్రికల్లో బీఆర్ఎస్ ప్రకటనలు ఇవ్వడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీకి సీఈఓ ఆఫీస్ నోటీసు జారీచేసింది. నిర్దిష్ట డెడ్‌లైన్ ప్రకారం మంగళవారం సాయంత్రానికి సీఈఓ ఆఫీస్‌కు రిప్లై చేరాల్సి ఉన్నది. మరోవైపు కర్ణాటక రాష్ట్ర సంక్షేమ పథకాలపై తెలంగాణలోని పత్రికల్లో ఆ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఇచ్చిన ప్రకటనలపై బీజేపీ, బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదులతో నోటీసు జారీ అయింది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ముందస్తుగా ఈ యాడ్‌లకు ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నదని, కానీ అది లేకుండానే ప్రచురించడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. ఈ నెల 24-27 తేదీల మధ్య అలాంటి ప్రకటనలు జారీ అయ్యాయని, ఇకపైన ప్రచురితం కాకుండా తక్షణమే నిలిపివేయాలని, పబ్లిష్ చేయాల్సి వస్తే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ప్రచురించినవాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా కర్ణాటక ఐ అండ్ పీఆర్ సెక్రటరీకి మంగళవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చింది. నిర్దిష్ట గడువులోగా వివరణ రానిపక్షంలో ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కమిషన్ తరఫున అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed