ఆయన మళ్లీ యాక్టివ్... కేడర్‌లో ఫుల్ జోష్

by srinivas |
ఆయన మళ్లీ యాక్టివ్... కేడర్‌లో ఫుల్ జోష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యే, మరో ఎనిమిది ఎంపీ సీట్లను గెల్చుకుని గతంతో పోలిస్తే ప్రాతినిధ్యాన్ని పెంచుకున్నా.. దాదాపు ఐదారు నెలలుగా పార్టీ తరఫున ఎలాంటి యాక్టివిటీ చేపట్టలేదనే నిరుత్సాహం బీజేపీ శ్రేణుల్లో నెలకొన్నది. ఒకవైపు పార్టీ సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. నత్తనడకన సాగుతుండటంపై పార్టీ కేంద్ర నాయకుడు బన్సల్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి స్టేట్ చీఫ్‌గా కిషన్‌రెడ్డి ఉన్నా రాష్ట్రంలో ఆందోళనలకు ఎలాంటి ప్రోగ్రామ్ ఇవ్వలేదని రాష్ట్ర నాయకులూ నిరుత్సాహంతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న హైడ్రా, మూసీ పునరుజ్జీవం కార్యక్రమాలపై పార్టీ విధాన నిర్ణయం తెలియక ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో మాట మాట్లాడుతున్నారు. ప్రజలతో కలిసి ఆందోళనలు నిర్వహించడం, రోడ్డెక్కే కార్యక్రమాలు లేవని నీరసంగా ఉన్న పరిస్థితుల్లో గ్రూప్-1 అభ్యర్థులకు సంఘీభావం తెలిపేందుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అశోక్‌నగర్ వెళ్లి ‘చలో సెక్రెటేరియట్’ పిలుపు ఇవ్వడంతో ఒక్కసారిగా విద్యార్థి, యువత, మహిళా విభాగాల్లో జోష్ పెరిగింది.

ఒకే ఒక్క ప్రోగ్రామ్‌తో కేడర్‌లో ఉత్సాహం

ఇంతకాలం ఎలాంటి చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా ఉన్న పార్టీ యాక్టివిటీస్ బండి సంజయ్ పాల్గొన్న ఒకే ఒక్క ప్రోగ్రామ్‌తో మళ్లీ ఉత్సాహం పెరిగిందనే అభిప్రాయం కేడర్‌లో వ్యక్తమైంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇకపైన కూడా కొనసాగాలనే అభిప్రాయాన్ని పలువురు స్టేట్ లీడర్లు వ్యక్తం చేశారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా ఇంతకాలం శ్రేణులు నీరస పడ్డాయని, పార్టీ లీడర్లతో ఎమ్మెల్యేలు, ఎంపీలకు గ్యాప్ పెరిగిందని, ఈ అగాధాన్ని పూడ్చడానికి రాష్ట్ర నాయకత్వం అందుబాటులో లేకపోవడం మరో కారణమని ఆ పార్టీకి చెందిన పలువురి ఆవేదన. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగిపోవడంతో గ్రూప్-1 అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంఘీభావం తెలపడంతో మైలేజ్ ఆయనకు వచ్చిందనే అక్కసు కూడా కొంతమందిలో వినిపిస్తున్నది. స్తబ్దుగా ఉన్న పార్టీలో ఒక్కసారిగా జోష్ పెరగడం అనుబంధ విభాగాల్లో సంతోషంగా ఉన్నా కొందరు లీడర్లలో మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తమవుతున్నది.


పార్టీకి ప్లస్ అయిన సంజయ్ అరెస్ట్

బండి సంజయ్‌ను అరెస్టు చేయడంతో పార్టీ కేడర్ సచివాలయం ముందుకు వెళ్లి రోడ్డుపై కూర్చుని నిరసన తెలపడం, వారిని కూడా పోలీసులు అరెస్టు చేయడంతో పార్టీకి ప్లస్ పాయింట్ అనే వాదన కూడా ఆ పార్టీలో వినిపిస్తున్నది. ఇదే తరహా కార్యక్రమాలు ఇకపై కూడా కొనసాగాలని, కనీసం వారానికొకటైనా పార్టీ టేకప్ చేయాలని కేడర్‌ కోరుకుంటున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారంటీల అమలు, హైడ్రా కూల్చివేతలు, మూసీ పునరుజ్జీవం.. ఇలాంటి అంశాలన్నింటిపై పార్టీ ప్రోగ్రామ్ తీసుకుంటే ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినట్లు మాత్రమే కాక మరోవైపు పొలిటికల్ స్పేస్‌లో బీఆర్ఎస్‌కు దీటుగా బీజేపీ ఎస్టాబ్లిష్ అవుతుందనేది వారి వాదన. పార్టీలో గ్రూపుల సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లతో పోలిస్తే యాక్టివిటీస్‌లో ఎక్కడా తగ్గకుండా ఉంటామన్నది వారి అభిప్రాయం. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇందిరా పార్కు దగ్గర బీజేపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన రైతు దీక్ష మినహా పార్టీ తరఫున నిర్వహించిన పెద్ద ప్రోగ్రామ్ ఏదీ లేదని శ్రేణులు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed