అస్తవ్యస్తంగా రోడ్లు .. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం!

by GSrikanth |   ( Updated:2022-10-15 08:01:00.0  )
అస్తవ్యస్తంగా రోడ్లు .. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం!
X

దిశ, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న డిండి మండలాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. డిండి నుంచి దేవరకొండకు ప్రయాణం చేయాలంటే నరకం అనుభవించాల్సిందే అంటూ గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా డిండి నుంచి గోనకొల్లు, బాపనుకుంటా వరకు రోడ్డు అస్తవ్యస్తంగా తయారై మోకాళ్ల లోతు గుంతలు పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. ఈ రహదారి గుండా నిరంతరం భారీ వాహనాలు ప్రయాణాలు చేస్తుండటం గమనార్హం. అంతేగాక, వర్షా కాలంలో డిండి డ్యాం నుంచి విడుదల అయ్యే నీరు రోడ్లమీదకు చేరడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారుతోందని గోనకొల్లు ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని స్థానిక సర్పంచ్ బొల్లె మంజుల శైలేష్ తెలిపారు. రోడ్డును ఇలాగే వదిలేస్తే రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున తక్షణమే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రోడ్లు ధ్వంసమై ఏడాది కావొస్తుంది: విభూది లింగమయ్య (వ్యాపారస్తుడు గోనకొల్లు)

నేను వ్యాపారం నిమిత్తం రోజూ గోనకొల్లు నుండి డిండికి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటాను. దాదాపు సంవత్సర కాలంగా 5 కిలోమీటర్లు పరిధిలో పదిచోట్ల భారీ గుంతలు పడ్డాయి. రాత్రిపూట అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణం చేయవలసి వస్తోందని వాపోయారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed