- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గురుకులాలను గాలికొదిలేశారా?
దిశ, జగిత్యాల ప్రతినిధి : పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు వివాదాలకు కేంద్రాలుగా నిలుస్తున్నాయి. గురుకులాల్లో పని చేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరుతో గురుకుల పాఠశాల నిర్వహణ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
జిల్లాలోని కొన్ని గురుకుల పాఠశాలలు వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా పాఠశాలలపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. పాఠశాల నిర్వహణపై అధికారుల నియంత్రణ కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆరోపణలు వచ్చిన ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండడంతోనే పరిస్థితిలో మార్పు రావడంలేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.
విచారణ జరిగినా మార్పు లేదా?
జిల్లాలోని ఓ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఇటీవలే ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులను వ్యక్తిగత పనులకు ఉపయోగించుకోవడమే కాకుండా కొందరు విద్యార్థులతో ఇటుకలు మోపించి, మొక్కల కోసం గుంతలు తవ్వించాడని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు కేవలం ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి చేతులు దులుపుకున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.
మైనర్లతో పనులు చేయించారని ఆరోపణలు వచ్చినప్పటికీ అధికారులు పారదర్శకంగా విచారణ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో విచారణ పారదర్శకంగా జరిపి సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇదివరకే ఏబీవీపీ నాయకులు పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థులతో కుర్చీల మోత..
గత నెలలో జిల్లా కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కుర్చీలు మోయించిన ఘటన బయటకి వచ్చింది. విషయం బయటకు పొక్కడంతో జరిగిన ఘటనకు కిందిస్థాయి ఉద్యోగిని బాధ్యులను చేస్తూ విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. తాజాగా గత వారం ధర్మపురి నియోజకవర్గంలోని మగ్గిడిలో నిర్వహిస్తున్న గొల్లపల్లి మండల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని అధ్యాపకుడు చితకబాదడం వివాదాస్పదంగా మారింది.
పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు దండించగా బాలుడు సృహతప్పి పడిపోయినట్లు తెలుస్తుంది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కర్రతో బాదిన ఉపాధ్యాయుడు..
ఆ ఘటన మరువక ముందే సోమవారం కోరుట్ల నియోజకవర్గంలోని ఓ గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బాలుడిని ఓ ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడంతో చేయి విరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తల్లిదండ్రులతో మాట్లాడి విషయం బయటకు పొక్కకుండా కుండా వ్యవహరించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ప్రిన్సిపాల్ పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అధికారుల ఉదాసీనతే కారణమా?
గురుకుల పాఠశాలలో జరిగే ఘటనలను ఎప్పటికప్పుడు ఆర్‌సీఓ దృష్టికి తీసుకు వెళ్లాల్సి ఉండగా కొంతమంది ప్రిన్సిపాల్‌లు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా అవి తమ మెడకు చుట్టుకోకుండా ఉండేందుకు విచారణకు వచ్చిన ఉన్నతాధికారులను తప్పు దోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. జిల్లాలోని ఓ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకున్ని ఆర్‌సీఓ దృష్టికి తీసుకు వెళ్లకుండానే విధుల నుంచి తొలగించడం వివాదాస్పదంగా మారింది.
ఈ తొలగింపు వ్యవహారాన్ని సదరు ఉపాధ్యాయునికి గాని ఆర్‌సీఓకి గాని తెలుపకుండానే ఇష్టారీతిన నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలగించిన అధ్యాపకుని స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఈ విషయం ఆర్‌సీఓ దృష్టికి తీసుకువెళ్లలేదా? ఒకవేళ తీసుకువెళ్తే చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.