Dharani Portal ‘బ్లాక్ చైన్’ ఉన్నా చీకటి పనులే..! టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి ధరణి బదలాయింపు

by Shiva |
Dharani Portal ‘బ్లాక్ చైన్’ ఉన్నా చీకటి పనులే..! టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి ధరణి బదలాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ధరణి అంటే అందుబాటులోకి రియల్ టైమ్ డేటా. ప్రపంచంలో ఏ మూల నుంచైనా అరచేతిలో మొబైలు ఫోన్ ద్వారా పట్టాదారు భూమి వివరాలు సైతం చెక్ చేసుకోవచ్చు. ఆటోమెటిక్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్.. మధ్యవర్తులు, దళారుల దందాకు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలకు అడ్డుకట్ట’.. అని ధరణి పోర్టల్ ప్రారంభించిన కొత్తలో అప్పటి సీఎం కేసీఆర్, మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ప్రచారం చేశారు. పైకి వినడానికి ఇవన్నీ బాగానే ఉన్నా.. రెవెన్యూ రికార్డు విషయంలో ఒక లావాదేవీ వెనక దాగి ఉన్న చరిత్ర తెలిపే లింకు డాక్యుమెంట్లు, తహశీల్దార్ ఆఫీసులోని పహానీ, 1-B, సంబంధిత పట్టా మార్పిడి ఫైల్ చాలా కీలకం. కానీ.. పహానీ, 1-B ఆన్‌లైన్ కావడం, సంబంధిత ఫైల్ స్కాన్డ్ ఇప్పుడు ధరణి క్లౌడ్ స్టోరేజీలోకి వెళ్లిపోయి కార్యాలయాల్లో ఎలాంటి ఫిజికల్ రికార్డు నిర్వహించలేదు. దాంతో ఏ లావాదేవీ ఎలా జరిగిందో తెలిపే ఆధారం అందుబాటులో లేకుండాపోయింది. ఫలితంగా రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, కాందిశీకుల, భూధాన్, సీలింగ్, సర్ఫేఖాస్ భూములు దొడ్డిదారిన పట్టా మార్పిడి జరిగాయి. వీటన్నింటినీ బయటపెట్టాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని వాడడం వల్ల ఈ అక్రమాలన్నీ బయటపడుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

బ్లాక్ చైన్‌లో హిస్టరీ

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ భూదందాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమార్కుల భరతం పడుతామని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా అవినీతిని బయటపెడుతామన్నారు. అయితే.. టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది. ధరణి అక్రమాల గుట్టు తేలాలంటే ఫోరెన్సిక్, టెక్నికల్, సోషల్ ఆడిట్ జరగాల్సిందేనని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు. ధరణి వచ్చిన తొలి నాళ్లలో ప్రతి సర్వే నంబర్, డిజిటల్ సంతకం నుంచి మొదలు.. తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిల్లో భాగస్వాములైన ప్రతి ఆపరేటర్, ఉన్నతాధికారి లాగిన్, ఇంటర్నెట్ ఉపయోగించిన ఐపీ అడ్రస్‌లు, సమయంతో సహా ‘ట్రాన్సాక్షన్ హిస్టరీ’ అనే ఆప్షన్ కింద రికార్డు అయ్యేది. ఇప్పుడు ధరణిని టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి బదిలీ చేసే క్రమంలో.. ఈ డేటా కూడా తప్పనిసరిగా బదలాయించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. తద్వారా అనుమానమున్న ప్రతి ట్రాన్సాక్షన్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ ఈజీ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బ్లాక్‌చైన్‌ ఉపయోగించి అక్రమాలను బయటపెడితే.. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో అక్రమాలకు తెగబడిన ధరణి ఆపరేటర్ మొదలుకొని తహశీల్దార్లు, కలెక్టర్లు, సీసీఎల్ఏ కార్యాలయం, సైట్ నిర్వాహకుల వరకూ తప్పించుకునే పరిస్థితి ఉండదు.

ట్రాన్సాక్షన్ హిస్టరీ ప్రధానం

గతంలో ధరణి పోర్టల్ నిర్వహించిన ప్రైవేటు ఏజెన్సీలు సీసీఎల్ఏ, కలెక్టర్ ఎవరు డిజిటల్ సంతకాలు చేసినా చివరికి రికార్డులో తహశీల్దార్ సంతకమే కనిపించేది. కలెక్టర్, తహశీల్దార్ స్థాయిల్లో పలు ఫైళ్లు తిరస్కరించినా.. కొందరు రెవెన్యూ అధికారులు వివాదాస్పద భూముల ఫైల్స్‌ను ఆమోదిస్తూ పట్టాలు జారీ చేశారు. కలెక్టర్లు, తహశీల్దార్లకు తెలియకుండా డిజిటల్ సంతకాలు ఫోర్జరీ చేశారు. దీనిపై గతంలో తహశీల్దార్లు ఆందోళనలు సైతం చేశారు. కానీ.. గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశం ఎక్కడా హైలైట్ కాలేదు. అలాగే సంబంధిత అక్రమ పట్టాలపై కోర్టు కేసులలో నోటీసులు జారీ కావడంతో కొందరు తహశీల్దార్లు తలలు పట్టుకుంటున్నారు. అసలు వాటి రెవెన్యూ రికార్డులు కార్యాలయాల్లో అందుబాటులో లేనప్పుడు తాము ఎలా స్పందించాలని ఆందోళన చెందుతున్నారు. ఇలా రూ.లక్షల కోట్ల విలువైన భూములు పట్టా మార్పిడి జరిగిన ఉదంతాలు ఉన్నాయి.

ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్.. ఇంకొన్ని ఇతర జిల్లాల కేంద్రాల్లో ఇలాంటి అక్రమాలు జరిగాయి. ఇటీవల రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ఉదంతం ఇదే అంశాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే.. ఎవరి అక్రమాలు బయటకు రావాలన్నా.. ఎవరు ఫోర్టరీలు చేశారో తెలియాలన్నా ‘ట్రాన్సాక్షన్ హిస్టరీ’ ఇప్పుడు కీలకంగా మారింది. ప్రతీ అక్రమ లావాదేవీ గుట్టు తేల్చడానికి ఇదే కీలకం కానుంది. దీనిని బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగించడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఈ సాంకేతికతలో ప్రతీ డిజిటల్ ఇంటర్వెన్షన్ కూడా అన్నీ ధరణి సర్వర్లలో తప్పకుండా బ్లాకుల రూపంలో నమోదవుతుంది. ఆ డేటాను ఎట్టి పరిస్థితులలోనూ మార్చలేం. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా వాటిని ధ్వంసం చేస్తే మాత్రం ఎవరు ఏం చేయలేదు. అందుకే ఫోరెన్సిక్ ఆడిట్ అనివార్యంగా మారింది.

రైట్ టూ ప్రైవసీతో గోప్యత

ఆన్‌లైన్, రియల్ టైమ్ రికార్డు, రైట్ టూ ప్రైవసీ ఆప్షన్లు అడ్డుపెట్టుకొని గతంలో పలువురు అక్రమాలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో జరిగిన ప్రతి అక్రమ లావాదేవీ విషయంలో వచ్చే మార్చి, ఏప్రిల్ నాటికి అన్ని వివరాలు బయట పెడతామన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటల వెనక ఉన్న ఆంతర్యం కూడా ఇదేనని రెవెన్యూ నిపుణులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి కూడా ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయించి అక్రమాలు వెలికితీస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ట్రాన్సాక్షన్ హిస్టరీ ప్రధాన కారణంగా తెలుస్తోంది. అదేవిధంగా ధరణి మీద శ్వేతపత్రం విడుదల చేస్తామన్న వ్యాఖ్యలకు కూడా ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఫోరెన్సిక్ ఆడిటింగ్ కీలకం కానుంది. ఇప్పుడు ధరణి డేటా మొత్తం సజావుగా ఎన్ఐసీ చేతికి బదిలీ అయితేనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దలు, కొందరు ఉన్నతాధికారుల అక్రమాలు మొత్తం తప్పకుండా వెలుగుచూస్తాయి. అలాగే.. రానున్న రోజుల్లో ఈ అక్రమ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఆప్షన్ కూడా ‘భూమాత’ పోర్టల్ కింద ఆన్‌లైన్ చేయాలి. సమాచార హక్కు చట్టం-2005 కింద పౌరులకు సమాచారం అందుబాటులోకి తేగలిగితే అధికార దుర్వినియోగానికి అడ్డుకట్టపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తప్పుడు పట్టా మార్పిడి విషయంలో కోర్టు కేసుల్లోనూ విచారణ సులువవుతుందని అంటున్నారు.

Advertisement

Next Story