‘ధరణి పోర్టల్’లో వారి పాత్రపై ఆరా.. రూ.లక్షలు వెనుకేసుకున్న వైనం

by Gantepaka Srikanth |
‘ధరణి పోర్టల్’లో వారి పాత్రపై ఆరా.. రూ.లక్షలు వెనుకేసుకున్న వైనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వారి నెల వేతనం నెలకు రూ. 15 వేలే.. కోతలు మినహాయిస్తే ఇంకా తక్కువే.. అది కూడా ఏ రెండు, మూడు నెలలకోసారి అందుతుంది. అయితే అలాంటి కొందరు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లైఫ్ స్టయిల్ చూస్తే రాజసం ఉట్టి పడుతున్నట్టు కనిపిస్తుంది. ఖరీదైన కార్లు, టూ వీలర్స్ దర్శనమిస్తాయి. వారే ధరణి ఆపరేటర్లు. ఇప్పుడు తహశీల్దార్ కార్యాలయాల్లో చాలా వరకు వసూళ్లు ధరణి ఆపరేటర్ల కనుసన్నల్లో నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా రీజినల్ రింగ్ రోడ్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ పట్టణ శివారు ప్రాంత ధరణి ఆపరేటర్ల గురించే. ఆయా తహశీల్దార్, కలెక్టరేట్ కార్యాలయాలయాల్లో వీరి పెత్తనమే నడుస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. దీంతో ఆపరేటర్ల అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ద్వారా ఆపరేటర్ల వ్యవస్థపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు గ్రామీణ ప్రాంత ధరణి ఆపరేటర్లు మాత్రం వేతనాలు చాలక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

వారి పనులతో అనేక ఇబ్బందులు

పెండింగ్ మ్యూటేషన్లు, పీవోబీ జాబితాల సవరణ.. మొత్తం ధరణి ఆపరేటర్లదే హవా నడుస్తున్నదనే చర్చ ఉన్నది. నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ధరణి ఆపరేటర్ ఉద్యోగంలోకి వచ్చిన ఆరేండ్లలో 15 ఎకరాలు భూమి కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒక ఆపరేటర్ సుమారు 73 ఫైళ్లు పీవోబీ జాబితా నుంచి తొలగించారు. ఆ కేసు సంచలనంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో ఒక ఆపరేటర్ ది ఇదే తంతు. మహబూబాబాద్ జిల్లాలో ఓ తహశీల్దార్ తో ధరణి ఆపరేటర్ నేరుగా వాట్సాప్ చాట్ చేసి, ఆయన చెప్పిన ధరకే ధరణి స్లాట్స్ ప్రాసెస్ చేస్తున్నారనే ప్రచారం ఉన్నది. కొన్ని చోట్ల నేరుగా మీ సేవ కేంద్రాలు, ఇతర ప్రైవేటు వ్యక్తుల ద్వారా స్లాట్ బుక్ చేసే క్రమంలోనే కమీషన్ మాట్లాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాల వారీగా విచారణలు చేస్తే భూ బాగోతాలు అనేకం. కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తప్పులకు రూ.కోట్లాది విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవువుతున్నాయి. పట్టా భూములు తారుమారై కేసులు నమోదవుతున్నాయి. అయితే కొందరు తహశీల్దార్లు, కలెక్టర్లు ధరణి ఆపరేటర్ల చేతుల్లో పెట్టి.. కావాలనే అవినీతి చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. అంతా అయిపోయాక వాళ్ల మీద వేటు వేసి, చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంతా వారి చేతిలోనే..

గతంలో వరంగల్ జిల్లాలో ధరణి హాండ్ హోల్డింగ్ పర్సన్ కోట్లాది రూపాయలు ఇలా వసూలు చేశారని స్థానిక సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. అప్పటి కలెక్టరేట్ ఏవో తప్పించుకునేందుకు సదరు ధరణి ఆపరేటర్ ని విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వం ఒక్కసారి ఈ విషయంలో దృష్టి సారిస్తే కళ్ళు బైర్లు కమ్మే విషయాలు బయటికొస్తాయని బాధితులు చెప్తున్నారు. కొందరు కలెక్టర్లు కూడా ఈ ఆపరేటర్ల మీదనే ఆధారపడ్డారు. కొందరు ఐఏఎస్ లు మాత్రం నేరుగా ధరణి అర్జీదారు మొబైల్ కే వ్యక్తిగతంగా కాల్ చేసి.. ‘మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగారా? ఎవరెవరికి ఎంత ఇచ్చారు’ అని విచారణ చేస్తున్నారు. అలాగే కొన్నిసార్లు నేరుగా ఫీల్డ్ ఎంక్వయిరీ కూడా చేపడుతుందటంతో తహసీల్దార్లు కొంత అదుపులో ఉన్నారు. కానీ వారి వల్ల చాలా పనులు ఆగిపోతున్నాయి. పీవోబీ/పార్టు బి నిషేధిత జాబితాలో భూములు పెట్టడంతో వాటిని తొలగించడానికి చాలా కష్టం అవుతున్నది. గతంలో వీఆర్వో వ్యవస్థ ఉన్నప్పుడు గరిష్టంగా వేలల్లోనే పని అయ్యేది. ఇప్పుడు మాత్రం రూ.లక్షల్లో ఖర్చవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు, ఆర్ఎస్ఆర్/సేత్వార్ విస్తీర్ణం హెచ్చుతగ్గులు, సివిల్ వివాదాలు, కుటుంబ వివాదాలు.. ఇలాంటివే ధరణి ఆపరేటర్లు, ఇతర రెవెన్యూ సిబ్బందికి వరంగా మారుతున్నాయి. వీఆర్వో వ్యవస్థ రద్దుతో సమస్యలు ఇంకా జఠిలమై వందలు, వేల ఖర్చు కాస్తా లక్షలకు చేరింది. అందులో భాగంగానే నెల క్రితం రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అందుకే ముందుగా గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు మెరుగు పరిచి, రికార్డు సవరించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది.

ఎన్నెన్నో..

వరంగల్ జిల్లాలో ఒక తహశీల్దార్ బతుకున్నోడి భూమిని వాళ్ల పాలోళ్లకి విరాసత్ చేశారు. ఇప్పుడు వారి మీద క్రిమినల్ కేసు బుక్ అయ్యింది. అలాగే రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తంగళ్లపల్లి సర్వే నం.370లో అబ్దుల్ హుస్సేన్ పేరిట భూమి ఉంది. ఆ భూమి తమ తాదది అంటూ జిల్లేడ్ చౌదరిగూడకు చెందిన మహ్మద్ జహంగీర్ అనే వ్యక్తి ఫేక్ డెత్ సర్టిఫికెట్ ఆధారంగా విరాసత్ చేయించుకున్నారు. ఆ తర్వాత వేరే వాళ్లకు అమ్మేశారు. అసలైన వారసులు రాకతో విషయం బయటపడింది. ఇందులో అసలైన వారసులెవరో గుర్తించకుండానే విరాసత్ చేసేశారు. వరంగల్ జిల్లాలో ఒక తహశీల్దార్ సంతకాన్ని ధరణి ఆపరేటర్ ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి పట్టా ఇచ్చాడు. అయితే ఆ తర్వాత అతడిని బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఓ ధరణి అవుట్ సోర్స్ ఎంప్లాయీ వరంగల్ హంటర్ రోడ్డులో ఒక ప్రైవేట్ కార్యాలయం ఓపెన్ చేసినట్లు సమాచారం.

వార్నింగ్..

నేరుగా కలెక్టర్లు కలెక్షన్ కింగులు అయ్యారని ఇటీవల అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రస్తుత రెవెన్యూ అధికారులు తహశీల్దార్లు, డీటీలు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు అవినీతిని తగ్గించి, ప్రజలకి సేవ చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రెవెన్యూ శాఖ మంత్రి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ ధరణి ఆపరేటర్లు, రెవెన్యూ అధికారుల గురించి ఆరా తీస్తుండడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed