Minister Sridhar Babu : కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

by Sridhar Babu |
Minister Sridhar Babu : కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
X

దిశ, కుత్బుల్లాపూర్ : సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)అన్నారు. గాజులరామారంలోని అలీఫ్ (Aleph)ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ డిఫెన్స్ కాంక్లేవ్ కార్యక్రమానికి శుక్రవారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ శాఖకు అలీఫ్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ద్వారా అవసరమైన ఉత్పతులను మహిళా పారిశ్రామికవేత్తలు అందించడం ఎంతో సంతోషదాయకం అని అన్నారు.

మహిళా సాధికారతకు అలీఫ్ సంస్థ చేస్తున్న కృషికి గాను ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు. రానున్న మూడు, నాలుగు ఏళ్లలో రాష్ట్రంలో ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం అని పేర్కొన్నారు. రానున్న కాలంలో అలీఫ్ ఆధ్వర్యంలో మరిన్ని ఎంఎస్ఎంఈలను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని అన్నారు. అనంతరం అలీఫ్ ప్రాంగణంలో నిర్మించిన డిజిటల్ స్టూడియోను మంత్రి ప్రారంభించారు.

కార్యక్రమంలో అలీఫ్ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి, సంస్థ చైర్మన్ రమాదేవి, పీహెచ్ డీసీసీఐ డైరెక్టర్ డా .నాసిర్ జమాల్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ డా.ప్రవీణ్, అలీఫ్ సెక్రటరీ పద్మజ ప్రభాకర్, ట్రెజరర్ మహాలక్ష్మి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ సలహాదారు సుగీట్ కౌర్, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.మన్సూర్, మిథాని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ ఝా పాల్గొన్నారు.

Advertisement

Next Story