పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. ప్రమాదానికి కారణమిదేనా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-28 06:06:10.0  )
పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. ప్రమాదానికి కారణమిదేనా?
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వస్తుండగా బీబీనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదు. కాగా, ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

నిద్రలో ఉండగానే...

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు పదహారు బోగీలతో బయలుదేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్ బీబీనగర్ వద్దకు రాగానే పట్టాలు తప్పింది. ఎస్ 1, 2, 3, 4 ఎస్ఎల్ఆర్‌తో పాటు జనరల్ బోగి పెద్ద శబ్దం చేస్తూ ట్రాక్‌పై నుంచి కిందకి దిగిపోయాయి. దాంతో అప్పటికి నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి మేల్కొన్నారు. ఏం జరిగిందో తెలియక బోగీల నుంచి కిందకు దూకారు.

విషయం తెలిసిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన బోగిలను వేరు చేసి వాటిల్లోని ప్రయాణీకులను మిగితా బోగీల్లోకి ఎక్కించి సికింద్రాబాద్‌కు పంపించారు. హై డ్రాలిక్ జాక్స్ రప్పించి పట్టాలు తప్పిన బోగీలను ట్రాక్‌పైకి ఎక్కించే పనులు చేపట్టారు. మధ్యాహ్నం సమయానికి రెండు బోగీలను పట్టాలు ఎక్కించారు. ఇలా ట్రాక్ ఎక్కించిన బోగిలను అక్కడి నుంచి తరలించటానికి ఇంజన్ ఏర్పాటు చేసారు.

విచారణ...

ప్రమాదానికి కారణాలు ఏమిటన్నది ఇప్పుడే చెప్పలేమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ చెప్పారు. దీనిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. దీనికోసం కమిటీ ఏర్పాటు చెయ్యనున్నట్టు చెప్పారు. కాగా, బీబీనగర్ వద్ద ట్రాక్ దెబ్బ తిని చాలా రోజులవుతున్నట్టు తెలుస్తోంది.

మరమ్మత్తులు చేపట్టాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదని సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో గోదావరి రైలు ఓవర్ లోడుతో రావటం వల్లే ప్రమాదం జరిగిదని అంటున్నారు. అదృష్టవశాత్తు ఆ సమయం లో రైలు వేగం తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని చెబుతున్నారు.

Advertisement

Next Story