డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ

by karthikeya |   ( Updated:2024-10-07 09:03:22.0  )
డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా భవన్ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ చెక్కులను కార్మికులకు పంపిణీ చేశారు. 2023- 24 సంవత్సరంలో సింగరేణికి రూ.2,412 కోట్ల లాభం వచ్చిందని, అందులో 33 శాతం అంటూ రూ.796 కోట్లను కార్మికులకు బోనస్‌గా అందిస్తున్నట్లు ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి లక్షా 90 వేల రూపాయలను బోనస్‌గా ఇస్తామంటూ స్వయంగా డిప్యూటీ సీఎం ప్రకటించారు. గతంతో పోల్చుకుంటే రూ.20వేలు ఎక్కువగా బోనస్ ఇస్తున్నామని చెప్పడంతో కార్మికులంతా హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సింగరేణి చరిత్రలో తొలిసారిగా రెగ్యులర్ కార్మికులతో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా రూ.5 వేలు బోనస్ పంపిణీ చేశారు.

ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సింగరేణి చరిత్రలోనే ఈసారి అత్యధిక బోనస్ ప్రకటించామని అన్నారు. అలాగే కార్మికులకోసం అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే 1998- 99 నుంచి లాభాల్లో వాటా పంచే ఆనవాయితీ కొనసాగిస్తోంది సింగరేణి. ఏటా లాభాల నుంచి కొంత మొత్తాన్ని కార్మికులకు బోనస్‌గా ప్రకటిస్తూ వస్తోంది. గతేడాది 1227 కోట్ల లాభం సాధించిన సింగరేణి.. అందులో 30 శాతాన్ని అప్పటి ప్రభుత్వం బోనస్‌గా అందజేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సింగరేణి స్థానిక ఎమ్మెల్యేలు, కార్మికసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed