Delhi liquor scam: విచారణ మార్చి17కు వాయిదా

by GSrikanth |   ( Updated:2023-02-23 11:08:05.0  )
Delhi liquor scam:  విచారణ మార్చి17కు వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజు రోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌‌పై గురువారం రౌస్ ఎవెన్యూలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితులను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌తో పాటు సప్లిమెంటరీ చార్జిషీట్ వారం రోజుల్లో నిందితులకు అందజేయాలని ఈడీ అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.

సమీర్ మహేంద్రు బెయిల్ పిటిషన్‌పై వాదనలు:

లిక్కర్ పాలసీ కేసులో నిందితుడు సమీర్ మహేంద్రు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. సమీర్ మహేంద్రును అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నందున సర్జరీ కోసం బెయిల్ ఇవ్వాలని సమీర్ కోరారు. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపిస్తూ మహేంద్రుకు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేస్తున్నామని అతడి ట్రీట్మెంట్ ను తాము అడ్డుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు కానీ పిటిషనర్ సమస్య అంత తీవ్రమైనది కానందున బెయిల్ నిరాకరించాలని కోరారు.

సమీర్ మహేంద్రుడు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కస్టడిలో ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని పరిరక్షించడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సర్జరీ చేయాల్సి ఉన్నా తాత్కాలికంగా పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారని చెప్పారు. అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగి లివర్ మీద ప్రెజర్ పడే అవకాశం ఉందని సర్జరీ చేసుకోవడానికి బెయిల్ ఇచ్చినప్పటికీ అతను కేసుకి సంబంధించిన విషయాలు చెప్పడానికి అందుబాటులో ఉంటారని అన్నారు. గతంలో వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ఈ సందర్భంగా లాయర్ ప్రస్తావించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ పై తీర్పు ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు.

Advertisement

Next Story