పంట నష్ట పరిహారం అధికార పార్టీ రైతులకే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-12 06:12:31.0  )
పంట నష్ట పరిహారం అధికార పార్టీ రైతులకే..!
X

దిశ, నేలకొండపల్లి: అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆ శాఖ అధికారులు అంచనా వేయడంలో, క్షేత్ర స్థాయిలో పర్యటించడంలో వైఫల్యం చెందారని తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన రైతులకు మాత్రమే పరిహారం అందేలా అంచనాలు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నేలకొండపల్లి మండల వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, మామిడి పంటలు ఆకాల వర్షం, వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే నష్టపోయిన పంటను అంచనా వేయడంలో ఆయా శాఖ అధికారులు అధికార పార్టీకి చెందిన రైతులకు మాత్రమే పరిహారం అందేలా అంచనాలు వేస్తున్నారని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అకాల వర్షంతో వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు తీవ్రంగా నాశనమయ్యాయి. మొక్కలకు తెగుళ్లు సోకుతున్నాయి. కాయలు తడిసిపోయాయి. కల్లాల్లో కాయలు తడిసి రంగు మారి తాలు కాయలయ్యాయి. ఇవన్నీ నష్టాలే. కానీ అసలు నష్టమే జరగలేదని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెప్పడం దారుణం. నిబంధనలు మార్చాలంటూ రైతులు కోరుతున్నారు. ఇక ప్రకృతి విపత్తు నివారణ, వర్షాల నేపథ్యంలో రైతులకు పంట తడవకుండా ఇవ్వాల్సిన ఇంప్లిమెంట్ అందించడం మానేశారు. దీనితో కల్లాల్లో ఉన్న పంట తడిసి మరీ రైతులు నానా తంటాలు పడుతున్నారు.

కనిపించని ఆ శాఖ అధికారి...

మండలంలోని ఆ శాఖ అధికారి రైతుల సమస్యలపై కార్యాలయానికి వస్తే కనీస అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదని రైతులు తెలిపారు. ప్రధానంగా మండలంలోని పలు గ్రామాల రైతులు వివిధ సమస్యలపై, సలహాలు, సూచనల కోసం వేస్తే కనీసం సమాధానం చెప్పే వారే లేరని వాపోతున్నారు. ఎప్పుడూ కార్యాలయంలో కనిపించే పరిస్థితి లేదనీ అక్కడ కార్యాలయం ఓపెన్ చేసి ఉంటుంది కానీ అధికారి అందుబాటులో ఉండరని రైతులు అంటున్నారు. అధికారి ఉన్నా సరైన సమాధానం ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.

వసూళ్ల పర్వం.....

మండలంలోని రైతుల సమస్యలు పక్కన పడేసి వసూళ్ల పర్వానికి తెర లేపారని మండల ప్రజలు వాపోతున్నారు. మండలంలో పలు ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాపులు ఉన్నాయి. వీటిని ప్రతీనిత్యం తనిఖీ చేయాల్సిన అధికారి అటు దిశగా చూడాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఆరోపణలున్నాయి. దీనితో అయా షాపుల వారు వారికి ఎక్కువ కమిషన్ వచ్చే మందులు రైతులకు అంటగాడుతున్నారు. కారణం ఆ షాపుల నుంచే నెలవారీ అమ్యమ్యాల అందిస్తున్నరని విమర్శలు ఉన్నాయి. ఆ దిశగా అలవాటు పడి రైతుల సమస్యలు గాలికి వదిలేశారని రైతులు అంటున్నారు. ఇందుకు నిదర్శనమే ఒ షాపుకి చెందిన గుమస్తాను అందరు కలిసి అన్ని షాపుల నుంచి దక్షణ వసూలు చేయడానికి ఉంచారనేది బహిరంగ రహస్యమే అని వినియోగదారులు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణే ఇటీవల షాపునకు కొంత మొత్తంలో ఆ వ్యక్తి వసూలు చేసి ఆ అధికారికి ముట్టాజెప్పుతున్నరని సమాచారం.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే షాపు పై ఎటువంటి కిరికిరి పెడుతుందో అని మందుల, ఎరువుల షాపు యజమానులు భయపడుతున్నారు. ఇప్పటికైనా ఆ అధికారిపై తగు చర్యలు తీసుకొని తమ పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Also Read.

పంట నష్టం నివేదికలో పేరుందా..? రైతులలో తీవ్ర ఆందోళన

Advertisement

Next Story

Most Viewed