అక్కడ రైతాంగ సాయుధ పోరాటయోధుల విగ్రహాలను పెట్టాలి.. సీఎంకు కూనంనేని లేఖ

by Ramesh N |
అక్కడ రైతాంగ సాయుధ పోరాటయోధుల విగ్రహాలను పెట్టాలి.. సీఎంకు కూనంనేని లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సెప్టెంబర్‌ 17ను ‘ప్రజాపరిపాలన’ పేరుకు బదులుగా ‘విలీన దినోత్సవం’గా జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూనంనేని లేఖ రాశారు. ప్రజాపరిపాలన దినోత్సవం అనే పేరుతో రాష్ట్ర వ్యాపితంగా అధికారికంగా సెప్టెంబర్‌ 17ను జరపడం సంతోషమన్నారు. కానీ ప్రజా పరిపాలన అనే పేరు వలన ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, కమ్యూనిస్టుల త్యాగాలు, కాంగ్రెస్‌, సోషలిస్టుల ఆగ్రనాయకుల త్యాగాలు ఇప్పుడున్న తరాలకు తెలియకుండా పోయే ప్రమాదం ఉన్నదన్నారు.

1948 సెప్టెంబర్‌ 17న ఇండియాలో తెలంగాణ ప్రాంతం విలీనం చేస్తూ ‘యాక్సెసెన్‌’ అనే పదంతో అగ్రిమెంట్‌ జరిగిందన్నారు. యాక్సెసెన్‌ అంటే ‘విలీనం’ అని అర్థమన్నారు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుల విగ్రహాలను ట్యాంక్‌ బండ్‌ మీద ప్రతిష్టించాలని కోరారు. ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమంటేనే మఖ్దూం మొహియుద్దీన్‌, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి వంటి ఈ యోధుల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వారితో పాటు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య తదితర నాయకుల విగ్రహాలు ట్యాంక్‌బండ్‌ పెట్టడం ద్వారా ఆనాటి పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయవచ్చన్నారు. ఇప్పటికే మఖ్దూం విగ్రహాం ట్యాంక్‌ బండ్‌పై ఉన్నందున ఆ విగ్రహాం పక్కనే బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి విగ్రహాలు పెట్టాలని కోరారు. బొమ్మగాని ధర్మభిక్షం లాంటి మిగతా యోధులవి వారి వారి జిల్లాల కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed