తెలంగాణలో కాంగ్రెస్ 'వన్ ప్లస్ వన్' ఫార్ములా.. రంగంలోకి ప్రశాంత్ కిషోర్ మాజీ అనుచరుడు

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-07 02:32:30.0  )
తెలంగాణలో కాంగ్రెస్ వన్ ప్లస్ వన్ ఫార్ములా.. రంగంలోకి ప్రశాంత్ కిషోర్ మాజీ అనుచరుడు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఓటుగా మారాలంటే ఏం చేయాలి? అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ పరిస్థితి ఏమిటి? విజయం సాధించాలంటే ఎలాంటి మార్పులు చేయాలి? తదితర అంశాలపై కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదికను సిద్ధం చేశారు. దానిని ఈ వారం ఏఐసీసీకి అందజేయనున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తప్పవనే ఊహాగానాల నేపథ్యంలో ఎస్కే తన బాధ్యతను వేగంగా పూర్తి చేస్తున్నారు. త్వరలో పీసీసీ చీఫ్ రేవంత్‌తో భేటీ అయ్యి పార్టీ తాజా పరిస్థితి, పార్టీ అనుకూల, ప్రతికూల అంశాలను వివరించనున్నారు. పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు తీసుకోవాల్సిన అంశాలపైనా తన అభిప్రాయాలను తెలపనున్నారు.

వన్ ప్లస్ వన్ ఫార్ములా..

మరే రాష్ట్రంలో లేనన్ని డిజిటల్ సభ్యత్వాలు తెలంగాణలో నమోదైనందున సరికొత్త ఫార్ములాను సూచించినట్టు తెలిసింది. సుమారు 40 లక్షల మంది మెంబర్ షిప్ తీసుకున్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మరొకరితో ఓటు వేయించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం సులభమనే అభిప్రాయం వెలిబుచ్చారు. ఎస్కే తన నివేదికలో 'వన్ ప్లస్ వన్' అని నొక్కిచెప్పనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నదని కాంగ్రెస్ బలంగా నమ్ముతున్నందున ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రంగంలోకి దిగడానికి ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇందుకోసం సునీల్ కనుగోలు ఇచ్చే నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది.

మేనిఫెస్టో ఎలా ఉండాలి

ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అసంతృప్తి, దానికి దారితీసిన కారణాలు, అది కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడనున్నది తదితర అంశాలన్నింటినీ ఎస్కే తన నివేదికలో నియోజకవర్గాల వారీగా వెల్లడించనున్నారు. అధికార పార్టీ పట్ల ఏ సెక్షన్ ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నది.. కాంగ్రెస్‌‌ను ఏ మేరకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.. బీజేపీకి అనుకూలంగా ఉండే పరిస్థితులేంటో కూడా ఈ నివేదికలో తేటతెల్లం కానున్నది. ఏ సెక్షన్ ప్రజలను దగ్గర చేసుకోవడం ద్వారా ఓటు బ్యాంకు పెంచుకోవచ్చు అనే అంశాలనూ వివరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా ఎలాంటి హామీలను ఇవ్వవచ్చు.. ఇలాంటి అంశాలన్నింటిపై రానున్న కాలంలో పార్టీ ఫోకస్ పెట్టనున్నది. వచ్చే ఎన్నికల్లో విజయానికి ఎత్తుగడలను కూడా సునీల్ కనుగోలు తన నివేదికలో పొందుపరచనున్నారు. ఏ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి అభ్యర్థిని కోరుకుంటున్నారు, ఆ అభ్యర్థి నుంచి లేదా పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు, వారి ఆకాంక్షలేంటి, ప్రస్తుతం సిట్టింగ్‌ల పట్ల ఏయే అంశాల్లో అసంతృప్తితో ఉన్నారు.. అనే విషయాలు ఈ నివేదికలో ఉంటాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. వాటి ఆధారంగానే టికెట్ల కేటాయింపు మొదలు గెలుపు వ్యూహాన్ని ఖరారు చేయడం వరకు నిర్ణయాలు తీసుకోనున్నది. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కాంగ్రెస్ కూడా ఎస్కే ను బరిలోకి దింపి వ్యూహాలను రచిస్తుండటం ఆసక్తికరంగా మారింది. కాగా గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో సునీల్ పనిచేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన సొంత సంస్థను స్థాపించాడు.

Advertisement

Next Story

Most Viewed