Donald Trump: మెక్సికో, కెనడాలకు షాక్ ఇచ్చిన అమెరికా.. 25 శాతం సుంకం విధింపు

by Shamantha N |
Donald Trump: మెక్సికో, కెనడాలకు షాక్ ఇచ్చిన అమెరికా.. 25 శాతం సుంకం విధింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఘన విజయం సాధించారు. కాగా.. పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల సుంకాల (Tariff)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. మెక్సికో (Mexico), కెనడా (Canada) నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. మాదక ద్రవ్యాల సరఫరా, చట్టవిరుద్ధమైన వలసలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ‘జనవరి 20న నా మొదటి ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లలో ఒకటిగా.. మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు వచ్చే అన్ని ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించేలా అవసరమైన పత్రాలపై సంతకం చేస్తా’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా, చైనా (China) వస్తువులపై సైతం 10 శాతం సుంకం విధించాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు.

వ్యతిరేకించిన కెనడా

కెనడా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకాలు విధించడాన్ని కెనడా నాయకుడు జిగ్మిత్‌ సింగ్‌ (Jagmeet Singh) వ్యతిరేకించారు. సుంకాలు పెంచినట్లు వచ్చిన వార్తలపై ఎక్స్ వేదికగా స్పందించారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) నేతృత్వంలోని లిబరల్‌ ప్రభుత్వం దేశం కోసం సుంకాల పెంపునకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే, దిగుమతులపై సుంకాలు విధిస్తే దేశవృద్ధిని దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని పలువురు ఆర్థికవేత్తలు ట్రంప్ ని హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరికొన్ని రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆర్థిక అజెండాలో సుంకాలు ముఖ్యమైనవి. అధ్యక్షుడిగా ఎన్నికైతే దిగుమతులపై సుంకాలు విధిస్తానని ప్రచారాల్లో చాలాసార్లు వెల్లడించారు. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed