బీఆర్ఎస్ మౌనంతోనే 7 మండలాలు కోల్పోయాం: జీవన్ రెడ్డి

by GSrikanth |
బీఆర్ఎస్ మౌనంతోనే 7 మండలాలు కోల్పోయాం: జీవన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ మౌనంతోనే ఏడు మండలాలను కోల్పోయామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీ హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. భద్రాచలం సమీపంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ మౌనం వహించిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. అందుకే ఆ మండలాలన్నీ ఏపీలో కలిశాయన్నారు. మోడీతో దోస్తీ కొరకే కేసీఆర్ ఇలా వ్యవహరించారన్నారు. పైగా ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా గతంలో స్పందించలేదన్నారు.

స్వార్థ పూరిత రాజకీయాలకోసమే బీఆర్ఎస్ పనిచేసిందన్నారు. సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడానికి కేసీఆరే నైతిక బాధ్యత వహించాలన్నారు. ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగా వాట్ల విద్యుత్‌ను పొందే హక్కు ఉన్నదన్నారు. కానీ 2600 మెట్ల వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయామన్నారు. ఐటీఐఆర్ తేవడంలో ఫెయిలయ్యామన్నారు. విభజన చట్టం హక్కులను సాధించడంలోనూ విఫలమయ్యారన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్‌గా బీఆర్ఎస్ తయారు చేసిందన్నారు. త్వరలోనే కాళేశ్వరం అవినీతిని బయట పెడతామన్నారు.

ఇక పీవీ నర్సింహారావు మీద బీఆర్ఎస్ ఇప్పుడు కొత్తగా ఎనలేని ప్రేమ చూపుతుందని, రాజకీయాలు కోసం గొప్ప లీడర్ పేరును వాడుకోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. పీవీ సంపూర్ణ కాంగ్రెస్ వాదని, ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చారన్నారు. పీవీ అంతిమ యాత్ర హైదరాబాద్‌లో నిర్వహించాలని కుటుంబ సభ్యులు పట్టుబడితేనే గతంలో అన్ని లాంఛనాలతో గౌరవ వందనాలతో చేశారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు కోసం చట్ట సభల్లో విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

Advertisement

Next Story

Most Viewed