- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. జిల్లాల సరిహద్దుల్లో మార్పు?
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన 33 జిల్లాలపై ప్రస్తుత ప్రభుత్వం సమీక్షకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. జిల్లాల ఏర్పాటు ఇష్టానుసారంగా జరిగిందని కాంగ్రెస్ భావిస్తున్నది. దీంతో జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పుల విషయంలో అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసే చాన్స్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో టాక్ ఉంది. అయితే ఆ కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రజాభిప్రాయం మేరకు మార్పులు, చేర్పులు
ప్రస్తుతం అమల్లో ఉన్న 33 జిల్లాలను మార్పులు, చేర్పులు చేసే విషయంలో ముందుగా ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రిటైర్డ్ జడ్జి, ఐఏఎస్ ఆఫీసర్లో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చర్చ జరుగుతున్నది. ఈ కమిటీకి జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పుల విషయంలో అన్ని వర్గాల నుంచి ప్రజాభిప్రాయం సేకరించే బాధ్యతను అప్పగిస్తారని ఓ సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు. ప్రస్తుత జిల్లాలను అలాగే కొనసాగించాలా? ఏమైన సవరించాలా? అనే అభిప్రాయాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సదరు అధికారి వివరించారు.
ఒక అసెంబ్లీ.. ఒకే జిల్లా
ఉమ్మడి రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం ఒకే జిల్లా పరిధిలో ఉండేది. కానీ జిల్లాల విభజన తరువాత ఒక అసెంబ్లీ సెగ్మెంట్ రెండు, మూడు జిల్లాల పరిధుల్లోకి వెళ్లింది. దీంతో ఒక్కో మండలం ఒక్కో జిల్లా పరిధిలోకి వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు రోజువారి పనుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అందుకని జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పుల విషయంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిని ఒకే జిల్లాలో ఉండేవిధంగా ప్లాన్ చేయాలని ఆఫీసర్లు భావిస్తున్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వులకు ఇబ్బంది లేకుండా..
జిల్లాల పునర్విభజన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు. విద్యా, ఉద్యోగ నియామకాల కోసం గతంలో ఉన్న రెండు జోన్ల వ్యవస్థను 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా మార్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు ఇబ్బంది లేకుండా చేయాలని జిల్లాల సరిహద్దులను మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకవేళ జోనల్ వ్యవస్థను మార్చితే ఉద్యోగాల భర్తీపై ప్రభావం పడే చాన్స్ ఉంది. కొత్త జోనల్ కు రాష్ట్రపతి మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ పక్రియ పూర్తవడానికి సమయ ఎక్కువ తీసుకుంటుందనే భావనలో అధికారులు ఉన్నారు.
పది జిల్లాలను ఫాలో అవుతున్న ప్రభుత్వం
సీఎం రేవంత్ రెడ్డి పది జిల్లాల ప్రకారం ఇన్ చార్జి మంత్రులను నియమించారు. ఆ జిల్లాల్లో జరిగే ప్రభుత్వ నిర్ణయాలు సదరు మంత్రుల ఆదేశాల మేరకు జిల్లాల కలెక్టర్లు నడుచుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రజాపాలన విషయంలో నియమించిన నోడల్ ఆఫీసర్లను కూడా పది జిల్లాలను దృష్టిలో పెట్టుకునే నియమించారు.
రాజకీయ ఒత్తిళ్లు.. లక్కీ నంబర్!
కేసీఆర్ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనపై అనేక విమర్శలు వచ్చాయి. భౌగోళిక, జనాభా అంశాలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ తన లక్కీ నంబర్ 6 ప్రకారం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టు అప్పట్లో విమర్శలు వచ్చాయి. 2018 ఎన్నికల కంటే ముందు జిల్లాల పునర్విభజన 31కే పరిమితం కాగాస, రెండోసారి అధికారంలోకి వచ్చాక మరో రెండు జిల్లాలు (ములుగు, నారాయణపేట) ఏర్పాటు చేసి మొత్తం 33కు పెంచడం గమనార్హం. అలాగే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే సిరిసిల్ల జిల్లా ఏర్పాటు అయిందనే ప్రచారం ఉంది. ఆ జిల్లా పరిధిలో కేవలం ఒకే రెవెన్యూ డివిజన్ ఉంది. అలాగే మరో ఐదు జిల్లాల్లో కూడా ఒకే రెవెన్యూ పరిధినే జిల్లాగా గుర్తించారు. ఇప్పటికే ఆ జిల్లాల్లో సరైన అధికార యంత్రాంగం లేదు. కొందరు ఆఫీసర్లు రెండు, మూడు జిల్లాలకు ఇన్ చార్జిలుగా పనిచేస్తున్నారు.