- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్, బీజేపీ స్పీడు.. సైలెంట్ మోడ్ లోనే గులాబీ బాస్
దిశ, డైనమిక్ బ్యూరో:రానున్న లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో పార్టీలు కసరత్తు వేగవంతం చేశారు. గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి వివిధ దశల్లో నివేదికలను తెప్పించున్న పార్టీ పెద్దలు తుది జాబితాపై దృష్టి సారించారు. లోక్ సభ అభ్యర్థుల జాబితాపై ఏర్పడిన ఉత్కంఠకు తెర దించేందుకు కాంగ్రెస్, బీజేపీలు జోరు పెంచాయి. ఇవాళ హైదరాబాద్ కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ కు వస్తుండగా మరో వైపు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగబోతున్నది. ఈ భేటీకి తెలంగాణ నేతలు సైతం హాజరుకాబోతుండగా అభ్యర్థుల విషయంలో ఎలాంటి ప్రకటనలు రాబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతున్నది.
ఖర్గే ఏం తేల్చబోతున్నారు?:
ఏపీ కాంగ్రెస్ చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యే నిమిత్తం ఖర్గే, కేసీ వేణుగోపాల్ లు హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయి టికెట్లపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీతో పాటు తదితరులతో సమావేశమై అభ్యర్థుల జాబితాపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మహబూబ్ నగర్ టికెట్ వంశీచందర్ కే అని కన్ఫర్మ్ చేయగా నాగర్ కర్నూల్ టికెట్ కోసం మల్లు రవి పట్టుతో ఉన్నారు. ఈ టికెట్ కోసం ఆయన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి సైతం రాజీనామా చేశారు. దీంతో పార్టీలో ఒక్కసారిగా టికెట్ల కోసం పొలిటికల్ హీట్ పెరిగినట్లైంది. మిగతా చోట్ల కూడా భారీ సంఖ్యలో ఆశావాహులు ఉండటం కొత్త నేతల చేరికలు జరుగుతున్న నేపథ్యంలో టికెట్ల కేటాయింపులో గెలుపు అవకాశాలు, సామాజిక న్యాయం తదితర అంశాలను బేరీజు వేసుకుంటూ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నది అనేది ఆసక్తిగా మారింది. మరో వైపు పలువురు సీనియర్లకు చెందిన కుటుంబ సభ్యులు టికెట్ల కోసం పోటీ పడుతుండటంతో ఈ వ్యవహారం టీకాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నది.
మూడు పేర్లతో బీజేపీ అధిష్టానం వద్ద జాబితా:
ఇవాళ జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల తదితరులు బీజేపీ పెద్దలతో సమావేశం అయి లోక్ సభ ఎన్నికలపై చర్చించనున్నారు. టికెట్ కోసం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర నేతలకు అధిష్టానం ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. ఈ భేటీ తర్వాత రాష్ట్రంలో సగం లోక్ సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇబ్బందులు లేవు అనుకున్న చోట్ల అభ్యర్థులను ప్రకటించడమే ఉత్తమం అని భావిస్తున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 4 ఎంపీ సీట్లలో మూడింటిలో (ఆదిలాబాద్ మినహా) సిట్టింగ్ ఎంపీలనే బరిలోకి దింపనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హైకమాండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి ఆశావాహులకు సంబంధించి ముగ్గురి పేర్లతో కూడిన జాబితా రెడీ గా ఉందని తెలుస్తోంది. కుదిరితే ఇవాళే లేదంటే మార్చి రెండో వారంలో అభ్యర్థులను అనౌన్స్ చేసేందుకు బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. తీవ్రమైన పోటీ నెలకొన్న మల్కాజిగిరి మహబూబ్ నగర్ కు అభ్యర్థులుగా ఎవరికి ఛాన్స్ దక్కబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది. దీంతో ఈసారి టికెట్ల విషయంలో ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అనేది రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఆ పొరపాటు జరగకుండా కేసీఆర్ జాగ్రత్తలు!:
కాంగ్రెస్, బీజేపీలు ఎంపీ అభ్యర్థులపై కసరత్తు వేగవంతం చేస్తుంటే బీఆర్ఎస్ అధినే గులాబీ లో ఇంకా ఎటువంటి హడావుడి కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఫామ్ హౌస్ కే పరిమితం అయిన కేసీఆర్ లోక్ సభ ఎన్నికలపై వ్యూహాలు రచిస్తున్నారనే సమాచారమే తప్ప ఓ వైపు పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నా.. నేతలు చేజారుతున్నా ఆయన ఇంకా సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం పార్టీకి డ్యామేజీ చేసిందనే వాదనలు ఉన్న నేపథ్యంలో ఈసారి అటువంటి పొరపాటు చేయవద్దని మిగతా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాకే అభ్యర్థులను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదరబోతున్నదనే ప్రచారం నేపథ్యంలో గులాబీ బాస్ మౌనం సొంత పార్టీలోనూ చర్చగా మారింది.