కాంగ్రెస్, బీజేపీ.. ఫిఫ్టీ.. ఫిఫ్టీ.. మారిన పొలిటికల్ సీన్

by Sathputhe Rajesh |
కాంగ్రెస్, బీజేపీ.. ఫిఫ్టీ.. ఫిఫ్టీ.. మారిన పొలిటికల్ సీన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరి ఎనిమిది సీట్ల చొప్పున గెల్చుకోగా, హైదరాబాద్ స్థానాన్ని మజ్లిస్ పార్టీ పదిలం చేసుకున్నది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. గతంలో నాలుగు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ వాటిలో మళ్లీ గెలవడంతో పాటు అదనంగా మరో నాలుగు సీట్లను కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో మూడు చోట్ల గెలుపొందినా.. అందులో మల్కాజిగిరిని కోల్పోయింది. కానీ మరో ఆరు చోట్ల గెలుపొందడంతో ఆ పార్టీ సీట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది.

నల్లగొండ, భువనగిరి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, జహీరాబాద్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మెదక్ లో బీజేపీ పాగా వేసింది. అయితే గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఈసారి ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. ఆ పార్టీ ఉనికిలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎంపీ కూడా లేకపోవడం ఇదే మొదటిసారి. కాగా, రాష్ట్రం నుంచి గెలుపొందిన ఎంపీల్లో ఎనిమిది మంది మొదటిసారి పార్లమెంటులోకి అడుగు పెడతున్నారు. పదేండ్ల తెలంగాణ చరిత్రలో ప్రతీ ఎంపీ ఎన్నికల్లో ఒక్క మహిళ మాత్రమే గెలిచినా ఈ సారి ఆ సంఖ్య రెండుకు చేరుకున్నది. కాంగ్రెస్, బీజేపీ తరఫున చెరొకరు గెలిచారు.

బీజేపీ ఎంపీలపై పెరగనున్న ఒత్తిడి!

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే కాంగ్రెస్, బీజేపీలు తలా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ మిషన్ -15, బీజేపీ డబుల్ డిజిట్ టార్గెట్ గా పెట్టుకున్నా.. చేరుకోలేకపోయాయి. అయితే బీఆర్ఎస్ ఒక్క చోట కూడా గెలవకుండా చేయడంలో సక్సెస్ అయ్యాయి. అయితే కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పడుతుండడంతో తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలపై ఒత్తిడి పెరగనున్నది. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నుంచి నిత్యం విమర్శలను, డిమాండ్లను కాచుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానున్నది. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలపై ఉన్నదనే డిమాండ్‌తో కాంగ్రెస్ ఇకపైన వారిని టార్గెట్ చేసే అవకాశమున్నది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్‌వైపు చూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పటికీ వైఖరితో ఉన్నారా? లేక బీజేపీ బలపడడంతో అటువైపు ఆలోచిస్తున్నా? అని రాజకీయవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. దీంతో లీడర్లు, కేడర్‌ను కాపాడుకోవడం బీఆర్ఎస్‌కు అతి పెద్ద సవాలుగా మారింది.

దిద్దుబాటు చర్యలు

పార్లమెంట్ ఫలితాలపై కాంగ్రెస్, బీజేపీలు విశ్లేషించుకోనున్నాయి. ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో తక్కువ ఓట్లు పడ్డాయి? మార్జిన్ ఎందుకు తగ్గింది? క్రాస్ ఓటింగ్ ఎందుకు జరిగింది? గెలుస్తామనుకున్న సీటు ఎందుకు చేజారింది? ఇలాంటివన్నీ రానున్న రోజుల్లో ఎనలైజ్ చేసి దానికి తగ్గట్టు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టున్నాయి కాంగ్రెస్, బీజేపీలు. ఈ రెండు పార్టీల స్టేట్ చీఫ్‌ల మార్పు ఇప్పటికే ఆ పార్టీల హైకమాండ్ దృష్టిలో ఉన్నందున రానున్న రోజుల్లో ఎవరికి అవకాశం లభిస్తుంది? వారు పార్టీని బలోపేతం చేసుకోడానికి ఏం చేయబోతారన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిబింబించనున్నది. ఈ ఏడాది చివర్లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నందున మూడు ప్రధాన పార్టీలకు ఇది తక్షణ టాస్క్ గా మారనున్నది.

Advertisement

Next Story

Most Viewed