హైడ్రా అధికారాలపై గందరగోళం.. అత్యధిక ఆక్రమణలు అక్కడే

by Gantepaka Srikanth |
హైడ్రా అధికారాలపై గందరగోళం.. అత్యధిక ఆక్రమణలు అక్కడే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రా ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో తక్షణం అమల్లోకి వచ్చింది. హైడ్రా కూల్చివేతలపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు అందుకు సమ్మతించని సమయంలోనే ఆర్డినెన్సుకు రాజ్‌భవన్ ఆమోదముద్ర వేసింది. తక్షణం అమల్లోకి వస్తున్నట్లు గవర్నర్ ఆ ఆర్డినెన్సులో పేర్కొనడంతో ఈ నెల 3న గెజిట్‌ విడుదల చేసింది. కానీ జీహెచ్ఎంసీ యాక్ట్ 1955ను మాత్రమే సవరించి 374-బీని చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. ఇది జీహెచ్ఎంసీ పరిధికి మాత్రమే పరిమితమవుతుంది. కానీ హైడ్రా ఏర్పాటు చేస్తూ జారీచేసిన ఉత్తర్వుల్లో ఓఆర్ఆర్ పరిధిలోని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) వరకు వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతో హైడ్రా అధికారాలపై గందరగోళం నెలకొంది.

సెక్షన్ 374-బీతో..

ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్సులో జీహెచ్ఎంసీ చట్టంలో ‘సెక్షన్ 374-బి’ను చేర్చడం ద్వారా హైడ్రా (ప్రత్యేక ఏజెన్సీ)కి అధికారాలు వచ్చాయి. చెరువులు, కుంటలు, కాల్వలు, నాలాలతో పాటు గ్రీనరీ, పబ్లిక్ స్థలాలు (ఓపెన్ ప్లేస్), కమ్యూనిటీ భవనాలు (స్థలం సహా), రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, డ్రెయిన్‌లను పరిరక్షించడం, అన్యాక్రాంతం కాకుండా కాపాడడం ఈ ప్రత్యేక ఏజెన్సీ బాధ్యతలు.. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 374-బి పేరుతో కొత్తగా చేరే క్లాజ్‌తో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ అనే స్పెషల్ ఏజెన్సీకి ప్రభుత్వ స్థలాల పరిరక్షణతో పాటు నీటి వనరులను ఆక్రమించిన కట్టడాలను తొలగించే అధికారం ఉంది. అయితే జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం హైడ్రాకు అధికారాలను బదాలయిస్తూ పురపాలక, పట్టణాభివ్రద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ బుధవారం జీఓ ఎంఎస్ నెం.191 జారీచేసిన విషయం తెలిసిందే.

ఆదేశాలే..అధికారాలేవి?

జీహెచ్ఎంసీ పరిధి 625చదరపు కిలోమీటర్ల వరకు చట్ట సవరణతో హైడ్రాకు అధికారాలొచ్చాయి. కానీ జీహెచ్ఎంసీ వెలుపుల అంటే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 27 ఉన్నాయి. వీటితోపాటు మరో 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)గా గుర్తించింది. ఈ రీజియన్ లో ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంతోపాటు విపత్తుల నిర్వహణపై ప్రభుత్వం ఆదేశాలు మాత్రమే ఉన్నాయి. అధికారాల్లేవు. ఈ ఏరియాలో హైడ్రా కార్యకలాపాలు చేపట్టాలంటే తప్పనిసరిగా మున్సిపల్ చట్టాన్ని సవరించి జీహెచ్ఎంసీ తరహాలో హైడ్రాకు అధికారాలను బదాలయించాలని న్యాయనిపుణులు చెబుతున్నారు.

అత్యధిక ఆక్రమణలు అక్కడే…

చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు జీహెచ్ఎంసీ పరిధి కంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధిలో అధికంగా ఉన్నాయని హైడ్రా అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులుంటే హెచ్ఎండీఏ పరిధిలో 3వేలకుపైగానే ఉన్నాయి. అత్యధిక భాగం టీసీయూఆర్ పరిధిలోనే ఉన్నాయి. హైడ్రా సైతం టీసీయూఆర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసిన రంగనాథ్

కొత్తగా బాధ్యతలు చేపట్టిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి.కెను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై సంయుక్తంగా, సమన్వయంతో పని చేయాలని ఇరువురు అధికారులు నిర్ణయించారు. అయితే హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మిని గానీ, అప్పటి కమిషనర్ ఆమ్రపాలిని గానీ రంగనాథ్ కలవలేదు. కొత్తగా వచ్చిన కమిషనర్ ను మాత్రం కలవడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed