‘పాల‌మూరు - రంగారెడ్డి’ అవకతవకలపై స‌మ‌గ్ర విచార‌ణ జరిపించండి : సీఎం రేవంత్ రెడ్డికి ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ లేఖ

by M.Rajitha |
‘పాల‌మూరు - రంగారెడ్డి’ అవకతవకలపై స‌మ‌గ్ర విచార‌ణ జరిపించండి : సీఎం రేవంత్ రెడ్డికి ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాల‌మూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అయిందని, దానిపై సమగ్రవిచారణ చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.ప‌ద్మనాభ‌రెడ్డి కోరారు. ఈ వ్యవహారంపై గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రాజెక్టును ప్రజలకోసం మంచి ఉద్దేశ్యంతో చేసింది కాదని, కేవలం లాభాపేక్షతోనే నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. పెద్ద ఎత్తున ప్రజాధ‌న‌ం దుర్వినియోగ‌మైందని స‌మ‌గ్ర విచార‌ణ చేసి బాధ్యుల‌కు శిక్షప‌డేలా చ‌ర్యలు తీసుకోవాలని కోరారు. పాల‌మూరు - రంగారెడ్డి ప్రాజ‌క్టు ప‌నుల‌లో రాజ‌కీయ ప్రమేయం స్పష్టంగా క‌నిపిస్తుందని, ఉన్నతాధికారులు, ఇంజ‌నీర్లు స‌రైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వక ముఖ్యమంత్రి ఆదేశాలే శిరోధార్యంగా ప‌నిచేసినారని ఆరోపించారు.

ద‌క్షిణ తెలంగాణ జిల్లాల‌కు సాగు, తాగునీరు అందించేందుకు ఎత్తిపోత‌ల ద్వారా కృష్ణాన‌ది నుంచి నీటిని తెచ్చేందుకు పాల‌మూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు 2014 ఆగ‌స్టులో గత ప్రభుత్వం శ్రీ‌కారం చుట్టిందన్నారు. ఇంజ‌నీరింగ్ స్టాఫ్ కాలేజీ ఇండియా స‌మ‌గ్ర స‌ర్వే చేసి డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అంద‌జేసిందన్నారు. జూరాల బ్యాక్ వాట‌ర్స్ నుంచి నీటిని ఎత్తిపోత‌ల ద్వారా తీసుకోవాల‌ని అందుకు రూ.32,200 కోట్లు ఖ‌ర్చువుతుంద‌ని డీపీఆర్‌ లో పేర్కొన్నారన్నారు. దీనిపై అప్పటి సీఎం జూరాల నుంచి కాక శ్రీ‌శైలం బ్యాక్ వాట‌ర్స్ నుంచి తీసుకోవాల‌ని సూచిస్తూ త్వరలోనే డీపీఆర్ సవ‌రించి తీసుకురావాల‌ని కోరారన్నారు. ఇఎస్‌సీఐ రెండు వారాల‌లో స‌వ‌రించిన డీపీఆర్‌ ను అందజేయగా గత సీఎం ఒప్పుకున్నారన్నారు. అదికాక సీఎం లిఫ్ట్‌ల ఎత్తుని త‌గ్గించ‌మ‌ని, క‌రివేన వ‌ద్ద ఒక రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణ‌ం చేయ‌మ‌ని సాంకేతిక సూచ‌న‌లు చేయ‌డం జ‌రిగిందన్నారు. ఈ నిర్ణయాలు రాజ‌కీయ‌నాయ‌కులు కాక నిష్ణాతులైన ఇంజ‌నీర్లు నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు.

పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప‌నులను కేంద్రం నుంచి ఎలాంటి పర్యావరణ అనుమ‌తులు తీసుకోకుండా మొద‌లుపెట్టారన్నారు. దీనిపై కొంద‌రు గ్రీన్ ట్రిబ్యున‌ల్ లో కేసులు వేయడం, ట్రిబ్యున‌ల్ 22లక్టోబర్ 2002 న తీర్పు వెల‌వ‌రిస్తూ “తెలంగాణ ప్రభుత్వానికి అనుమ‌తులు లేకుండా ప‌ని మొద‌లుపెట్టడం ఒక అలవాటుగా మారింద‌ని, ప్రతదానికి ప్రజ‌ల బాగోగుల‌కై ప‌నిచేస్తున్నామ‌ని చెపుతున్నారు. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేవ‌లం తాగునీటి కొర‌కై అని త‌ప్పుడు మాట‌లు చెపుతుంది... ఉద్దేశ్యపూర్వకంగా ట్రిబ్యున‌ల్ ఆదేశాలు ధిక్కరించినందుకు రాష్ట్రానికి రూ.920 కోట్లు జ‌రిమాన విధించారు’ అన్నారు. వ‌ట్టెం వ‌ద్ద స‌రిగా పంపులు అమ‌ర్చక‌పోవ‌డంతో మొన్నటి సెప్టెంబ‌రు వ‌ర్షాల‌కు పంపులు పూర్తిగా మునిగిపోయాయన్నారు. నిష్ణాతులైన ఇంజ‌నీర్లు తీసుకోవాల్సిన నిర్ణయాలు సీఎం తీసుకోవ‌డంతో త‌ర‌చూ మార్పులు చేర్పులు చేయ‌డంతో పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప‌నులు కుంటుప‌డ్డాయన్నారు.

2015లో మొద‌లై 3ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 9ఏళ్లు అయినా ఇంకా మ‌ధ్యలోనే ఆగిందని, పూర్తి కావడానికి ఇంకా 4 లేక 5 ఏళ్లు ప‌ట్టవ‌చ్చు అన్నారు. ప‌నుల‌లో ఆల‌స్యం త‌ర‌చూ మార్పులు, చేర్పుల‌తో రూ32,200 కోట్లతో పూర్తి కావ‌ల‌సిన ప్రాజెక్టు అంచ‌నా భారీగా పెరిగి ఇప్పుడు రూ.50 వేల కోట్లకు చేరిందన్నారు. ఎలాంటి సాంకేతిక విశ్లేష‌ణ లేకుండా కేవ‌లం సీఎం ఆదేశాల‌తో ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీ‌శైలంకు మార్చారన్నారు. కేంద్రం నుంచి త‌గిన అనుమ‌తులు లేకుండా ట్రిబ్యున‌ల్ ఆదేశాల‌కు విరుద్ధంగా ప‌ని మొద‌లు పెట్టి ట్రిబ్యున‌ల్ లో ప‌రువు పోగొట్టుకొని రూ.920 కోట్లు జ‌రిమాన వేయ‌బ‌డిందన్నారు. సెప్టెంబ‌రు 2024 నాటికి ఈ ప్రాజెక్టుపై రూ.31,850 కోట్లు ఖ‌ర్చు చేశారని, ఇంత‌వ‌ర‌కు ఒక్క ఎక‌రానికి కూడా నీరు ఇవ్వలేదు అన్నారు. వివిధ బ్యాంకుల నుండి వేల కోట్లు అప్పుల‌తో ఈ ప్రాజెక్టు ప‌ని చేప‌ట్టారని, సాలీన పెద్ద ఎత్తున వ‌డ్డీ చెల్లిస్తున్నారన్నారు. పాల‌మూరు - రంగారెడ్డి ప్రాజ‌క్టు రాష్ట్రానికి ఒక గుదిబండ‌గా త‌యారైందని, ఇంత‌లో ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే సూచ‌న‌లు లేవు అని, హైకోర్టులో భూసేక‌ర‌ణ కేసులు ట్రిబ్యున‌ల్‌లో కేసులు, సుప్రీమ్ కోర్టులో కేసులు తేలేదెప్పుడో అని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story