ఫైనాన్స్ సంస్థలతో పరిశ్రమల శాఖ కుమ్మక్కు

by Sathputhe Rajesh |
ఫైనాన్స్ సంస్థలతో పరిశ్రమల శాఖ కుమ్మక్కు
X

సబ్సిడీల వ్యవహారం జిల్లాలో చినికిచినికి గాలివానగా మారుతుందన్న ఆరోపణలు వినపిస్తున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి తీసుకున్న వాహనాలు.. కిస్తీలు కట్టలేదని ఓ వైపు ఫైనాన్సియర్లు తీసుకెళుతుంటే.. మరోవైపు సబ్సిడీ అందకుండా పరిశ్రమల శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. అంతేకాదు తమకు అనుకూలమైన మూడో వ్యక్తికి వాహనం విక్రయించి సబ్సిడీ కాజేస్తున్నారు. దీంతో అసలు కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతుంటే.. ఫైనాన్సియర్లు, పరిశ్రమలశాఖ అధికారులు, వాహనం కొనుగోలు చేసిన థర్డ్ పర్సన్ లాభపడుతున్నారు. ఫలితంగా సబ్సిడీ అసలు లబ్ధిదారులకు అందడంలేదనే విషయం స్పష్టమవుతుంది.

దిశ, ఖమ్మం సిటీ: పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న వాహనాల సబ్సిడీ రుణాల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. వాహన కొనుగోలుదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి ఫైనాన్స్‌లో వాహనాలు తీసుకుంటే సబ్సిడీ అందకుండా, ఫైనాన్సియర్లు వాహనాలు లాక్కెలుతున్నారు. రెండు, మూడు నెలల కిస్తీ చెల్లించలేదని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా వాహనాలను వేరేవారికి విక్రయిస్తున్నారు. వచ్చే సబ్సిడీని అందరూ పంచుకుంటున్నారు.

ఓ మహిళ పరిస్థితి ఇలా..

ఖమ్మం పట్టణానికి చెందిన ఓ మహిళ హిందూజా లీలాండ్ ఫైనాన్స్ నుంచి జేసీబీ వాహనాన్ని ఏడు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేసి కొనుగోలు చేసింది. మిగతా చెల్లింపులను నెలవారీ వాయిదా పద్ధతిలో చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నది. అనంతరం ఆ వాహనం మీద సబ్సిడీ కోసం పరిశ్రమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. దాదాపు 12 నెలలు కిస్తీలు చెల్లించిన తర్వాత మూడు నెలలుగా చెల్లించడంలో జాప్యం జరిగింది. ఈ జాప్యమే లబ్ధిదారుకు శాపంగా మారింది. మూడు నెలలు కిస్తీలు చెల్లించలేదని ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా ఫైనాన్స్ రికవరీ మేనేజర్ దౌర్జన్యంగా వాహనాన్ని తీసుకెళ్లిపోయారు.

అయితే వాహనం ఫైనాన్సియర్ తీసుకెళ్లాక సబ్సిడీ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని లబ్ధిదారు పరిశ్రమల శాఖకు వెళ్లి ఆరా తీయగా అక్కడే ఉన్న ఫైనాన్స్ మేనేజర్ మహిళపై చిందులు తొక్కాడు. కిస్తీలు చెల్లించకపోగా.. సబ్సిడీ కావాలా అంటూ ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్ లబ్ధిదారున్ని కులం పేరుతో దూషించాడు. పెట్టుబడి పోగా.. వాహనం ఫైనాన్సియర్ తీసుకెళ్లగా.. సబ్సిడీ రాకపోగా.. చివరకు తిట్లు తినాల్సివచ్చిందని ఆ మహిళ రఘునాథపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఈ విషయమై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. కాగా లబ్ధిదారుపై ఫైనాన్సియర్ జరిపిన దూషణ పర్వం మొత్తం జిల్లా పరిశ్రమల శాఖ మేనేజన్ అజయ్ కుమార్ ఎదుటే జరగడం విశేషం.

ఒకరి వాహనం మరొకరికి..

అయితే కొనుగోలు చేసిన అసలు లబ్ధిదారు తన వాహనం ఎక్కడ ఉందన్న విషయమై ఆరా తీయగా.. విస్తుపోయే విషయం వెల్లడైంది. ఆ వాహనం పక్క జిల్లాలో ఉందని తెలియడంతో దాన్ని విక్రయించినట్లుగా సమాచారం అందింది. వాస్తవానికి వాహనం తీసుకెళ్లాక కొనుగోలు చేసిన వారికి సమాచారం అందించి, అందుకనుగుణంగా అగ్రిమెంట్లు రాసుకుని, కట్టిన సొమ్మును కూడా సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటిదేమీ లేకుండానే వాహన్నాన్ని విక్రయించి దానిపై సబ్సిడీ పొందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వచ్చిన సబ్సిడీని అటు వాహనం తీసుకున్న వారికి ఇచ్చారో లేదో తెలియదుకానీ.. పరిశ్రమలశాఖ అధికారి, ఫైనాన్సియర్ నొక్కేసిట్లు తెలుస్తుంది.

అనేక విమర్శలు..

జిల్లా పరిశ్రమల శాఖలో సబ్సిడీల కోసం దళితుల పేరుతో కొంతమంది ఇతర కులాల వారు లబ్ధి పొందుతున్న ఆరోపణలు వినపడుతున్నాయి. దళితుల వద్ద ఒప్పంద పత్రాలు చేయించుకొని జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది ఇతర కులాల వారు లక్షలలో సబ్సిడీ తీసుకుంటున్నారని విమర్శలు లేకపోలేదు. అంతేకాకుండా జిల్లా పరిశ్రమల శాఖలో ఓ ప్రధాన అధికారి జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని ఫైనాన్స్ సంస్థలతో కుమ్మక్కై బాధితుల వాహనాలు ఫైనాన్స్ యాజమాన్యాలు తీసుకుపోవడానికి ప్రధాన కారకుడని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా అనేక మంది బాధితులు దిక్కు తోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story