నిరుద్యోగులకు శుభవార్త.. 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ ప్రకటన

by GSrikanth |   ( Updated:2024-02-09 11:07:47.0  )
నిరుద్యోగులకు శుభవార్త.. 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. అతి త్వరలో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. 15 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని.. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. పదే పదే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. పదేళ్లలో వారు ఏ ఒక్క హామీ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందా? అని ప్రశ్నించారు. గొప్పలకు పోయి అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కిరాణ దుకాణాల్లో టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడం తమకు తెలియదని.. చిత్తశుద్ధితో చాలా క్లియర్‌గా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీలు చేపడుతుతామని అన్నారు.

అతి త్వరలో గ్రూపు-1 నోటిఫికేషన్‌ కూడా ఇస్తామని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. అంతకుముందు అసెంబ్లీ వేదికగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరు గ్యారంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య స్నేహం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. తమకు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని.. ఎంఐఎం ఒక్కటే తమకు ఫ్రెండ్లీ పార్టీ అని అన్నారు. అయితే పోచారం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్ బంధమని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన అనేక బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు.

Advertisement

Next Story