సునీల్ కనుగోలుతో సీఎం రేవంత్ రివ్యూ.. మిషన్-15 టార్గెట్ మిస్‌కు కారణమిదే..!

by Rajesh |
సునీల్ కనుగోలుతో సీఎం రేవంత్ రివ్యూ.. మిషన్-15 టార్గెట్ మిస్‌కు కారణమిదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య పోస్ట్‌ పోల్ రివ్యూ జరిగింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు భారీ స్థాయిలో బీజేపీకి షిప్ట్ కావడంపైనే ప్రధాన చర్చ జరిగింది. ఈ కారణంగానే మిషన్-15 టార్గెట్ లెక్కలు తప్పాయని ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం నెలకొన్నది. నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎంత ఓటు బ్యాంకు నమోదైంది, కాంగ్రెస్‌ అంచనాలు ఎందుకు మారాయనే అంశాలపై ఢిల్లీలో సుదీర్ఘంగా వీరు చర్చించుకున్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్లుతాయనే అంశాన్ని తొలుత సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోలేకపోయామని, దాని తీవ్రతను గుర్తించినట్టయితే వ్యూహం మరోలా ఉండి ఉండేదన్న అభిప్రాయాన్ని ఇరువురూ లోతుగా విశ్లేషించుకున్నట్టు తెలిసింది. రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్..శనివారం సాయంత్రం సునీల్ కనుగోలుతో అనేక కోణాల నుంచి ఫలితాలపై చర్చించారు.

కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందనుకునే నియోజకవర్గాల్లో లెక్కలు తప్పడానికి కారణం అనూహ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ కావడమేనననే కంక్లూజన్‌కు ఇరువురూ వచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిందని, కానీ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్లలో తేడా రావడంపైనా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పడిన ఓట్ల కంటే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో అవే సెగ్మెంట్లలో తక్కువ ఓట్లు పోలైన అంశాలపైనా వీరిద్దరి మధ్య లోతుగా చర్చలు జరిగినట్టు సమాచారం. పార్టీ కేడర్ క్షేత్రస్థాయిలో తగినంతగా కష్టపడకపోవడమా? లేదా బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోగలిగిందా? లేదా బీఆర్ఎస్ ఓట్లు డైవర్ట్ కావడం వల్లనే ఓట్ షేర్‌లో వ్యత్యాసం వచ్చిందా..? ఇలాంటి అంశాలపైనా వీరిద్దరూ చర్చించుకున్నారు. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీల వారీగా పడిన ఓట్ల వివరాలకు అనుగుణంగా సమీక్ష జరిగింది.

క్యాంపెయిన్ సరళిపై డిస్కషన్

రాష్ట్రంలోని 17 లోక్‌సభ సెగ్మెంట్లలో కనీసం 15 చోట్ల గెలవాలని మిషన్-15 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా అందులో సగం మాత్రమే రీచ్ కావడం చర్చల్లో కీలకంగా మారింది. కనీస పక్షంలో 9-12 మధ్య సీట్లలో గెలుస్తామని, డబుల్ డిజిట్ వస్తుందని భావించినా తగ్గడానికి దారితీసిన కారణాలపైనా చర్చ జరిగింది. బీజేపీని ఢీకొట్టడంలో ఎంచుకున్న అంశాలను, క్యాంపెయిన్‌ సరళి, వాటి ప్రభావాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్టు తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి ఒక్క సీటు వచ్చినా ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు రావడం, ఆ రెండు ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్‌ను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు కూడా 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల షేర్‌ గురించి కూడా ఎనలైజ్ చేసినట్టు తెలిసింది.

6 నెలల పాలనపై నమ్మకం

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ పెరగడం, ఆరు నెలల పాలనా ఫలాలు, ఆరు గ్యారంటీల అమలు తదితరాలతో ప్రజల్లో నమ్మకం ఏర్పడిందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ కాకుండా ఉన్నట్టయితే కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా మారేదని, కానీ రెండు పార్టీలూ కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా భావించి లోపాయకారీగా వ్యవహరించడం వల్లనే అంచనాలు తప్పాయని వారిద్దరూ చర్చించుకున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ పెద్దలు, అభ్యర్థులు గమనించారని, గెలవడం కష్టమేనన్న అభిప్రాయానికి వచ్చి బీజేపీకి సాయం చేసే ఎత్తుగడలను అవలంబించారనే భావనకు వచ్చారు. బీఆర్ఎస్ ఓట్ షేర్ గణనీయంగా తగ్గిపోయినందునే గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 20 % లోపే ఓట్ షేర్ దక్కితే ఈసారి అది 35% దాటిందని, బీఆర్ఎస్ చలవే ఇందుకు కారణమనే నిర్ణయానికి వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed