ఆ నిధులు ఎంత‌మాత్రం స‌రిపోవు.. అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-07 15:58:50.0  )
ఆ నిధులు ఎంత‌మాత్రం స‌రిపోవు.. అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత నెల ఫస్ట్ వీక్‌లో కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలతో జరిగిన నష్టం రూ. 11,713.49 మేర ఉన్నదని, సత్వరమే ఈ మేరకు నిధుల్ని కేటాయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా వామపక్ష తీవ్రవాద సమస్యలపై జరిగిన సమావేశం అనంతరం కేంద్ర మంత్రితో సీఎం ప్రత్యేకంగా అరగంట పాటు భేటీ అయిన సందర్భంగా ఈ రిక్వెస్టు చేశారు. వారం రోజులకు పైగా కురిసిన వర్షాలు, వరదలతో కాల్వలు తెగిపోయాయని, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యయని, 37 మంది చనిపోయారని వివరించారు. నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, లక్షల సంఖ్యల పశువులు, మేకలు చనిపోయాయని తెలిపారు. రోడ్లు, కల్వర్టులు, కాల్వలు దెబ్బతినడంతో తక్షణ రిపేర్ పనులు చేశామని, ఇంకా చేయాల్సి ఉన్నదన్నారు. తక్షణ సాయంగా రూ. 5,438 కోట్లను ఇవ్వాల్సిందిగా గత నెల సెకండ్ వీక్‌లో లేఖ రాశామని గుర్తుచేశారు. ఇప్పుడైనా నిధులను విడుదల చేస్తే పనులను పూర్తి చేస్తామని వివరించారు.

మౌలిక వ‌స‌తుల పున‌రుద్ధ‌ర‌ణ‌, మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను తాము వెంట‌నే చేప‌ట్టామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో పంట‌, ఇత‌ర న‌ష్టాల‌పై కేంద్ర బృందం ప‌ర్య‌టించి మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.11,713 కోట్ల మేర న‌ష్టం వాటిల్లినట్లు సెప్టెంబ‌రు 30న నివేదిక స‌మ‌ర్పించింద‌ని సీఎం తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పున‌రుద్ధ‌ర‌ణ‌, మ‌ర‌మ్మ‌తుల ప‌నుల‌కు ఎంత‌మాత్రం స‌రిపోవ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ నిధులను విడుద‌ల చేయ‌నందున వెంట‌నే రిలీజ్ చేయాల‌ని కోరారు. 2024-25 సంవ‌త్స‌రానికి సంబంధించి ఎస్‌డీఆర్ఎఫ్ మొద‌టి, రెండో విడ‌త‌ల కింద తెలంగాణ‌కు రూ. 416.80 కోట్ల‌ను కేంద్రం విడుద‌ల చేసింద‌ని కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు. పున‌రుద్ధ‌ర‌ణ‌, మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌కు విడుద‌ల చేసే నిధుల‌ను గ‌తంలో ఎస్‌డీఆర్ఎఫ్ ప‌నుల‌కు సంబంధించిన నిధులు ఉప‌యోగానికి ముడిపెట్ట‌వ‌ద్ద‌ని కోరారు. ఎస్‌డీఆర్ఎఫ్‌కు సంబంధించిన నిధుల‌ను ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలోనే వ్య‌యం చేస్తామ‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ తెలిపారు.

అదనంగా 29 ఐపీఎస్ పోస్టుల్ని ఇవ్వండి :

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 76 ఐపీఎస్ పోస్టుల్ని కేంద్రం (ప్రత్యూష్ సిన్హా కమిటీ) అలాట్ చేసిందని, ప్రస్తుత అవసరాలకు ఈ సంఖ్య సరిపోదని, అదనంగా 29 ఐపీఎస్ పోస్టుల్ని కేటాయించాల‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఐపీఎస్ క్యాడ‌ర్‌పై రివ్యూ చేప‌ట్టాల‌ని గతంలోనే కోరామని, అది పెండింగ్‌లోనే ఉన్నదని తెలిపారు. ఇప్పుడైనా రివ్యూ చేసి అవసరాలకు అనుగుణంగా 29 ఐపీఎస్ పోస్టుల్ని కేటాయించాలన్నారు. ఈ స‌మావేశంలో న‌ల్లగొండ ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి జితేంద‌ర్ రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి శేషాద్రి, డీజీపీ జితేంద‌ర్ తదితరులు పాల్గొన్నారు.

పున‌ర్విభ‌జ‌న స‌మ‌స్య‌లను వెంటనే సాల్వ్ చేయండి :

పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పున‌ర్విభ‌జన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లోని (53, 68, 71 సెక్ష‌న్లు) ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ ప‌దిలోని సంస్థ‌ల వివాదం (75 సెక్ష‌న్) సామ‌ర‌స్య‌పూర్వ‌క‌ ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని కోరారు. పునర్విభజన చట్టంలో ఎక్క‌డా పేర్కొనని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున‌, వాటిలో తెలంగాణ‌కు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story