రాజ్యాంగ హోదాలను గౌరవించాల్సిందే.. మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం

by Mahesh |
రాజ్యాంగ హోదాలను గౌరవించాల్సిందే.. మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ కోణంలో చూసేవారు. ప్రధాని టూర్లకు డుమ్మా కొట్టడం, రాజ్ భవన్ ముఖం చూడకుండా రాజకీయ విమర్శలు చేసేవారు. చాలా సార్లు రాజ్ భవన్, ప్రభుత్వం మధ్య విమర్శల పర్వం కొనసాగింది. చివరికి వివాదాలు కోర్టుల వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ కోణంలో చూడడం లేదని చర్చ జరుగుతున్నది. రాజ్యాంగ వ్యవస్థలకు, ఆ హోదాలో ఉన్న వ్యక్తులకు గౌరవిస్తూనే, ఇష్టం లేని కేంద్ర ప్రభుత్వం విధానాలపై దుమ్మెత్తిపోస్తున్నారు.

నాడు ప్రొటోకాల్ వివాదాలు..

బీఆర్ఎస్ హయాంలో ప్రధాని టూర్లకు సీఎం వెళ్లేవారు కాదు. కేంద్ర ప్రొటోకాల్ రూల్స్ ప్రకారం పీఎం రాష్ట్రానికి వస్తే, సీఎం వెళ్లి రిసీవ్ చేసుకోవడం ఓ సంప్రదాయంగా ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి కేసీఆర్.. కేంద్రంతో రాజకీయంగా ఫైటింగ్ మొదలుపెట్టారు. దీంతో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఆయనను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లకుండా, జిల్లా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అలాగే గవర్నర్ గా ఉన్న తమిళి సై కు సరైన ప్రొటోకాల్ ఇవ్వకపోవడంతో అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఈ విషయంలో స్వయంగా తమిళిసై పలుసార్లు మీడియా ముందు తన ఆవేదనను పంచుకున్నారు. జిల్లా పర్యటనకు వెళ్తే కలెక్టర్లు, మంత్రులు వెళ్లేవారు కాదు. ఏదైనా పాలన అంశంపై వివరణ అడిగినా అధికారులు స్పందించేవారు కాదు. రాజ్ భవన్ కు రావాలని ఆదేశించినా వెళ్లేవారు కాదు. దీంతో రెండు వ్యవస్థల మధ్య అంతరం విపరీతంగా పెరిగింది. ఇలా చాలా అంశాల్లో రెండు వ్యవస్థల మధ్య యుద్ధమే నడిచింది. చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. రెండు వ్యవస్థల మధ్య సత్సంబంధాలు ఉండాలని హైకోర్టు సూచించడంతో వివాదం ముగిసింది. అయితే తమిళిసై గవర్నర్ గా ఉన్నంత కాలం కేసీఆర్ రాజ్ భవన్ ముఖం చూడలేదు.

నేడు ప్రొటోకాల్ ఇంప్లిమెంటేషన్..

రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పరంగా ప్రొటోకాల్ వివాదాలు రాలేదు. పీఎం మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రానికి నిధులు కేటాయించి సాయం చేయాలని బహిరంగ సభల్లోనే విజ్ఞప్తులు చేశారు. అలాగే గవర్నర్ గా ఎవరున్నా రాజ్ భవన్ కు వెళ్తున్నారు. అక్కడే జరిగే రాజ్యాంగపరమైన కార్యక్రమాలు, ప్రమాణ స్వీకారాలు, తేనీటి విందులకు హాజరవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలని ఆహ్వానిస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టేందుకు ఢిల్లీ నుంచి వస్తున్న జిష్టుదేవ్ వర్మను రిసీవ్ చేసుకునేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అలాగే ఈ మధ్య గవర్నర్ తొలిసారి జిల్లా పర్యటనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎక్కడ ప్రొటోకాల్ సమస్య రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. కలెక్టర్లు, జిల్లా మంత్రులు, ఇన్ చార్జి మంత్రులు వెళ్లి స్వాగతం పలికారు.

రాజ్ భవన్ తో సఖ్యత..

రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గవర్నర్ వ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో రేవంత్ కు ముగ్గురు గవర్నర్లతో పనిచేసిన అనుభవం దక్కింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయానికి తమిళిసై గవర్నర్ గా ఉన్నారు. లోక్ సభలో పోటీ చేసేందుకు ఆమె రాజీనామా చేయడంతో ఇన్ చార్జి గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టి సుమారు నాలుగున్నర నెలల పాటు పనిచేశారు. జూలై చివరన పూర్తి స్థాయి గవర్నర్ గా జిష్టుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితో ఆయన సఖ్యత గా ఉన్నారు. రెగ్యూలర్ గా రాజ్ భవన్ కు వెళ్లడం, ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు, పాలసీలపై చర్చించి వస్తున్నారు. గవర్నర్ ఇచ్చే తే నీటి విందులకు వెళ్తున్నారు. అలాగే రాజ్ భవన్ నుంచి వచ్చే ఆదేశాలను పాటించాలని అధికారులకు ఆదేశిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య ఆర్థిక, హెల్త్ శాఖకు చెందిన అధికారులు గవర్నర్ వద్దకు వెళ్లి, తమ శాఖల పనితీరుపై ఆయన రిపోర్టు అందించారు.

ముందు అప్పీలు, ఆ తర్వాత ఎటాకింగ్..

రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని కేంద్రానికి ముందు వినతులు ఇచ్చి తన రాజధర్మాన్ని చూపిన సీఎం రేవంత్ రెడ్డి, బడ్జెట్ కేటాయింపుల తర్వాత తన రాజకీయ ధర్మాన్ని చూపించడం మొదలుపెట్టారనే చర్చ జరుగుతున్నది. అలాగే కేంద్రం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సందర్భం వచ్చిన ప్రతిసారీ విమర్శిస్తున్నారు. ఈ మధ్య కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడంతో ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, తెలంగాణపై మోడీ కక్ష కట్టారని ఆరోపించారు. రాష్ట్రానికి నిధులు కేటాయించాలని 14 సార్లు వెళ్లి వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన చెందారు.

Advertisement

Next Story

Most Viewed