ఎమ్మెల్సీ కవితపై తొలిసారి సీఎం రేవంత్‌ తీవ్ర విమర్శలు

by srinivas |
ఎమ్మెల్సీ కవితపై తొలిసారి సీఎం రేవంత్‌ తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎంపీగా ఓడిపోయిన కల్వకుంట్ల కవిత(Kavitha)కు మూడు నెలల్లోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. గ్రూప్‌-4కు ఎంపికైన అభ్యర్థులకు పెద్దపల్లి యువవికాస సభ(Pedpadalli Yuva Vikasa Sabha)లో ఉద్యోగ నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఓడిపోయిన వాళ్లకు పదవులు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీగా ఓడిపోయిన వినోద్‌కు కేబినెట్ పదవి ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను సాధించారని, మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) కుటుంబం కాదని తెలిపారు. ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించడానికా తెలంగాణ(Telangana)ను తెచ్చుకుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

గత పదేళ్లలో రాష్ట్రానికి చేసింది శూన్యమని, మంచి పాలన అందిస్తున్న తమపై కొత్త బిచ్చగాడి మాదిరిగా శాపనార్ధాలు పెడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా అని ప్రశ్నించారు. ప్రతిదానికీ కొంత సమయం పడుతుందని తెలిపారు. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పది నెలల కూడా ఓపిక పట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చామని, దిగిపో, దిగిపో అనడమేంటని ప్రశ్నించారు. ఐదేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టుతోనే ప్రజల్లోకి వెళ్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story