CM Revanth Reddy: 'బిడ్డా.. నోరు జారితే అంతే సంగతి' కేసీఆర్, కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

by Prasad Jukanti |   ( Updated:2024-09-16 13:28:34.0  )
CM Revanth Reddy:  బిడ్డా.. నోరు జారితే అంతే సంగతి కేసీఆర్, కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొందరు సన్నాసులు పదే పదే కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని త్యాగం అంటే గాంధీ కుటుంబానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. ఇది రాజకీయ సభ కాదు. రాజకీయ విషయాలు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. కానీ త్యాగం అంటే ఏమిటో తెలియనని వారు ఇవాళ చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారని వారికి త్యాగం అంటే ఏమిటో ప్రాణ త్యాగం అంటే ఏమిటో గుర్తు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉందన్నారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. వీరంతా ఒకరు అధికారంలో ఉండగా మరొకరు అధికారంలో లేరని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి పదవులు చేపట్టే అవకాశం ఉన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాటిని తీసుకోలేదన్నారు.

కానీ కేసీఆర్ సీఎం, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి మంత్రి, బిడ్డ ఎంపీ, బంధువు రాజ్యసభ సభ్యుడిగా దుర్మార్గంగా పదవులు పంచుకున్నారు. పదవులన్ని పంచుకుని రాష్ట్రాన్ని దోచుకుని వందలాది ఎకరాల్లో ఫౌమ్ హౌస్ లు కట్టుకున్న మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతారా అని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేశాడు కాబట్టే కేటీఆర్ ఐటీ శాఖకు మంత్రి అయ్యాడని లేకుంటే గుంటూరులో ఇడ్లీ, వడా అమ్ముకునేవాడివి అని విమర్శించారు. ఈ దేశ సమగ్రతను కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి విగ్రహన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేస్తుంటే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇవి ఎంత బలుపు మాటలు. అధికారం పోయినా మదం దిగలేదు.

బిడ్డా.. మీ గడీలల్లో జిల్లెలు మొలిపిస్తా:

ఆనాటి సాయుధ పోరాటంతో గడీలలో గడ్డి మొలిసి ప్రజాస్వామ్య పాలన మొదలైందని, ఇవాళ నేను చెబుతున్నా బిడ్డా.. కాంగ్రెస్ పార్టీ మీద నోరు జారితే మీ ఫామ్ హౌస్ లో జిల్లెలు మొలిపిస్తానని హెచ్చరించారు. మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని ప్రకటించగాని ఇదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్నామని కేటీఆర్ గుండెలు బాధుకుంటున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు పదేళ్లు పడుతుందా? అధికారంలో ఉండగా ఏ గాడిద పళ్లుతోమావా అని ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ తన సొంత విగ్రహం ఇక్కడ పెట్టాలనుకుని ఈ స్థలాన్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నాడని ఆరోపించారు. ఏపీలో పార్టీ సర్వం కోల్పోయినా ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ తెలంగాణను ఇస్తే వారి కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి రాజీవ్ గాంధీ విగ్రహం కూలుస్తామంటున్నారు. ఎవడ్రా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది? ఒక్కడు రండి.. తారీఖు చెప్పండి ఎవరు వస్తారో నేను చూస్తానని చాలెంజ్ చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం సచివాలం నెలకొల్పుతామన్నారు. ప్రపంచం అంతా అబ్బురపడేలా ప్రారంభోత్సవం జరుపుతామన్నారు.

కేసీఆర్ కు ఫామ్ హౌస్ లో షాక్ ట్రీట్ మెంట్:

నిలువ నీడ లేకుంటే ఆశ్రయమిచ్చిన కొండా లక్ష్మణ్ బాపు మరణిస్తే కనీసం ఆఖరి చూపుకు కూడా కేసీఆర్ పోలేదు. ఇంతకంటే దుర్మార్గుడు, నీచుడు ఈ భూమి మీద ఇంకెవరైనా ఉంటారా? అని సీఎం ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చాక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపు పేరును, మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును పెట్టాం. పాత్రికేయుడు, సాయుధపోరాటాన్ని ముందుకు నడిపిన సురవర ప్రతాపరెడ్డి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టబోతున్నామన్నారు. ఈ పదేళ్లు వీటికి తెలంగాణ వారి పేర్లు పెడితే ఎవరైనా వద్దన్నారా? కాంగ్రెస్ కార్యకర్తలు వారిని బండకేసి కొడతారని ఊహించలేకపోయారు. అధికారం పోయింది, ప్రజా పాలన వచ్చింది, గడ్డీలు బద్దలైపోయాయి, వారి బతుకులు దివాళా తీశాయనే వాస్తవం కేసీఆర్ కు ఇంకా అర్థం కావడం లేదన్నారు. ఆయన ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని అందుకే కేసీఆర్ కు రెగ్యులర్ గా ఫామ్ హౌస్ లో షాక్ ట్రీట్ మెంట్ నడుస్తోందన్నారు. ఈ లోపు కొంతమంది చిల్లర మల్లర గాళ్లను మనపై మాట్లాడిస్తున్నారు. కాలకేయ ముఠా మన మీదకు రాబోతున్నది. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మిడతల దండై తెలంగాణను కబలించాలని కుట్రలు చేస్తున్నారు. ఈ దండును పొలిమేరలు దాటే వరకు తరిమే బాధ్యత మీది, నాది అన్నారు.

Advertisement

Next Story

Most Viewed